అయోధ్య,ఆర్టీఐ అంటి అంశాల్లో చారిత్రక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇవాళ(నవంబర్-14,2019)మరో మూడు కీలక తీర్పులు ఇచ్చేందుకు రెడీ అయింది. రాఫెల్, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ప్రధానిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ పై కూడా సుప్రీం తీర్పు ఇవ్వనుంది.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై ఆంక్షలు ఎత్తివేస్తూ 2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డు,నాయర్ సర్వీసెస్ సొసైటీ,దేవస్థాన తంత్రులు,పలువురు భక్తులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం కూడా పిటిసన్ వేసింది. పలువురు దాఖలు చేసిన దాదాపు 65 పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీంతీర్పు అమలుకు కట్టుబడి ఉన్నామని ట్రావెన్‌కోర్ దేవసోం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ తెలిపారు.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ కేంద్రమంత్రులు యశ్వంత్ సిన్హా,అరుణ్ శౌరీ,సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తీర్పుని పున:పరిశీలించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.
రాఫెల్ డీల్‌లోనే ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన ‘చౌకీదార్ చోర్ హై’ అన్న రాహుల్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి వేసిన పిటిషన్ పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పనుంది.