రాహుల్‌ గాంధీ ఎంపీ మాత్రమే.. హైలైట్ చేయాల్సిన అవసరం లేదు: కాంగ్రెస్ నేత

రాహుల్‌ గాంధీ పెద్ద నాయకుడేమీ కాదని, ఆయనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేత ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎవరాయన?

Rahul Gandhi just an ordinary MP and he should not be highlighted so much says Lakshman Singh

Lakshman Singh: కాంగ్రెస్‌ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీపై ఆ పార్టీకి చెందిన నేత ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ తమ కంటే గొప్పవాడేమీ కాదని, ఆయనను కూడా తమలాగే మీడియా చూడాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత లక్ష్మణ్‌ సింగ్‌ అన్నారు. గుణ నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తమ్ముడే ఈయన. లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రకటన చేసినప్పుడు టీవీల్లో ఆయన ముఖాన్ని తక్కువగా చూపించారని అడిగిన ప్రశ్నకు లక్ష్మణ్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. “రాహుల్‌ గాంధీ ఎంపీ మాత్రమే, ఆయన (పార్టీ) అధ్యక్షుడు కాదు, కాంగ్రెస్‌ కార్యకర్త. అంతకుమించి ఏమీ లేదు. మీరు (మీడియా) రాహుల్ గాంధీని అంతగా హైలైట్ చేయకూడదు, మేము కూడా చేయకూడద”ని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు..
రాహుల్ గాంధీ ఎంపీ మాత్రమేనని, మిగిలిన కాంగ్రెస్ పార్లమెంటేరియన్లతో ఆయన సమానమని లక్ష్మణ్‌ సింగ్‌ పేర్కొన్నట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.”పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కాదు. రాహుల్ గాంధీని అంత పెద్ద నాయకుడిగా పరిగణించవద్దు. ఆయనో సాధారణ ఎంపీ. మీడియా ఆయనను హైలైట్ చేసినా, చేయకపోయినా పర్వాలేద”ని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష్మణ్ సింగ్ ఐదుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై లక్ష్మణ్ సింగ్ ను వివరణ కోరగా.. పార్టీ కార్యకర్తనని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. తామందరం పార్టీ కార్యకర్తలమని పునరుద్ఘాటించారు. కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుణలోని చచౌరా స్థానం నుంచి పోటీ చేసిన లక్ష్మణ్ సింగ్.. బీజేపీకి చెందిన ప్రియాంక పెంచి చేతిలో 61 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

Also Read: ఆవులు, బంగారు ఉంగరం, ట్రేడ్ మిల్…ఇవీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆస్తులు

కాంగ్రెస్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు: బీజేపీ
లక్ష్మణ్ సింగ్ వ్యాఖ్యలపై ఒకప్పుడు కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా స్పందించారు. సోనియా కుటుంబం కాంగ్రెస్ పార్టీని ఫ్యామిలీ షాపులా నడుపుతోందని వ్యాఖ్యానించారు. “కేవలం ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీని ఎందుకు హైలైట్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు లక్ష్మణ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ భజన చేయడం వల్ల ఆయన అలా మాట్లాడి ఉంటారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ఇప్పడు ఆ పార్టీ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతకాలం పార్టీని కుటుంబ వ్యవహారంలా నడుపుతారో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంద”ని పూనావాలా అన్నారు.