Train Accident : పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదానికి కారణం అతడేనా..? రైల్వే బోర్డు చైర్మన్ ఏం చెప్పారంటే..

కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.

Kanchenjunga Express Train Accident : పశ్చిబ బెంగాల్ రాష్ట్రం దార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్ కతాలోని సిల్దాకు బయలుదేరిన కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ న్యూజల్ పాయ్ గుడి వద్ద కొద్దిసేపు ఆగింది. కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్ రైలు వేగంగా వచ్చి కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగీ గాల్లోకిలేచిపడింది. గూడ్స్ రైలు బోగీలు కూడా చెల్లాచెదురు అయ్యాయి. రైల్వే పోలీసులు, రెస్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు రైల్వే ఉద్యోగులు కూడా ఉన్నారు.

Also Read : Train Accident : పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన గూడ్స్ రైలు

సోమవారం ఉదయం 9గంటల ప్రాంతంలో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ అగర్తల నుంచి సీల్దాకు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదంపై అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే బోర్డు చైర్మన్ జయవర్మ సిన్హా మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాన్ని వెల్లడించారు. గూడ్స్ రైలు డ్రైవర్ (లోకో పైలట్) తప్పిదం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలిపారు. గూడ్స్ రైలు డ్రైవర్ సిగ్నల్ ను పట్టించుకోకుండా రైలును పోనివ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ప్రమాదంలో లోకో పైలట్ తోపాటు కాంచనజంగా ఎక్స్ ప్రెస్ లోని గార్డు కూడా ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. .

Also Read : ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ మర్డర్.. జైల్లోనూ నిందితురాలు డ్రామాలు

రైలు ప్రమాద ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. అగర్తలా – సీల్దా మార్గంలో అన్ని రైల్వే స్టేషన్ లలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగిందని జయవర్మ సిన్హా తెలిపారు. అయితే, రైలు ప్రమాదంపై విచారణ పూర్తయిన తరువాతే సరైన సమాచారం తెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుందని, పూర్తి వివరాలు సేకరించిన తరువాత ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటనే విషయంపై స్పష్టత వస్తుందని చెప్పారు.

ఇదిలాఉంటే .. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుండి రూ. 2లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. మరోవైపు రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5లక్షలు పరిహారం ప్రకటించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు