ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ మర్డర్.. జైల్లోనూ నిందితురాలు డ్రామాలు

ప్రభుత్వ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న భర్తను హత్య చేయించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు జైల్లోనూ మాయా మాటలతో పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది.

ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ మర్డర్.. జైల్లోనూ నిందితురాలు డ్రామాలు

ప్రియుడితో నిందితురాలు.. భార్య, కుమారుడుతో మృతుడు జాదవ్ గజేందర్ (ఫైల్ ఫొటో)

Adilabad School Teacher: భర్త హత్య చేయించిన కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళ జైలు సిబ్బందిని బురిడీ కొట్టించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా జైల్లో చోటుచేసుకుంది. నార్నూర్ మండలం నాగల్ కొండ గ్రామానికి చెందిన విజయలక్ష్మిని 3 రోజుల క్రితం జైలుకు తరలించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన భర్తను కిరాయి మనుషులతో చంపించినట్టు ఆరోపణలతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాను బ్లేడ్లు మింగి బలవర్మణానికి యత్నించినట్టు చెప్పడంతో పోలీసులు ఆమెను వెంటనే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో విజయలక్ష్మికి స్కానింగ్ తీయడంతో అసలు విషయం బయటపడింది. ఆమె బ్లేడ్లు మింగలేదని నిర్ధారణ కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విజయలక్ష్మి అబద్దం చెప్పినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఉర్వేత కృష్ణ అనే నిందితుడు బ్లేడుతో చేయి కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. అతడిని కూడా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పోలీసులు ఇద్దరిని మళ్లీ జైలుకి తరలించారు. నిందితులిద్దరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని జైలు సిబ్బంది వెల్లడించారు.

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ మర్డర్.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు..

కాగా, జైనథ్ మండలంలోని మేడిగూడ(కే)లో ఉన్న ప్రభుత్వ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న గజేందర్.. ఈ నెల 12న గాదిగూడ మండలం అర్జుని కొలాంగూడ గ్రామ శివారులో దారుణ హత్యకు గురయ్యారు. 6 లక్షల రూపాయలు సుఫారీ ఇచ్చి గజేందర్ ను ఆయన భార్య విజయలక్ష్మి హత్య చేయించినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. విజయలక్ష్మితో పాటు ఆమె ప్రియుడు మహేశ్, బండే సుశీల్, ఉర్వేత కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైల్లో కూడా విజయలక్ష్మి నాటకాలు ఆడడం చూసి పోలీసులు కూడా విస్తుపోయారు.