రాజస్థాన్‌లో జైసల్మేర్ నుంచి 57 మందితో జోధ్‌పూర్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో 20 మంది మృతి చెందారు. బస్సులోని చాలామంది ప్రయాణికులకు మంటలు అంటుకున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పందిస్తూ.. కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు అన్ని రకాల సాయం చేయాలని సూచించారు. అలాగే గాయపడినవారికి మెరుగైన చికిత్స ఇవ్వాలని ఆదేశించారు. స్వల్పంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి, తీవ్రంగా కాలిన వారిని జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
Also Read: హెచ్‌సీఏలో మరో కలకలం.. టాలెంటెడ్ ప్లేయర్లను తొక్కేస్తున్నారా? రాచకొండ సీపీకి ఫిర్యాదు
జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేపై తాయత్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత బస్సు వెనుకభాగం నుంచి పొగ రావడం ప్రారంభమైంది. డ్రైవర్, ప్రయాణికులు స్పందించేలోపే మొత్తం బస్సు మంటల్లో చిక్కుకుంది.
మంటలు చెలరేగగానే బస్సులో అరుపులు వినిపించాయి. ప్రయాణికులు కిటికీలు పగులగొట్టి బయటకు దూకే ప్రయత్నం చేశారు. పలువురి దుస్తులు, సామగ్రి కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సమీప గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కొద్ది సేపటికి అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. బస్సు ఇంజిన్ లేదా వైర్లలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.