రాజస్తాన్ లాక్‌డౌన్, కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Publish Date - March 22, 2020 / 02:45 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్ లాక్ డౌన్ ప్రకటించింది. నేటి(మార్చి 22,2020) నుంచి మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపింది. రాజస్తాన్ కు వచ్చే అన్ని జాతీయ రహదారులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రజా రవాణ ఆగిపోతుందని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. మాల్స్, షాప్స్ మూసివేసి ఉంటాయన్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. మాల్స్, షాప్స్ మూసివేసియడంతో పేదలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబాలకు ఫుడ్ ప్యాకెట్స్ ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లబ్దిదారులకు ఉచితంగా గోధుమల ఇస్తామన్నారు.

”లాక్ డౌన్ ఉన్నప్పటికి అత్యసవర సేవలు పని చేస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, మాల్స్, షాప్స్, పరిశ్రమలు, ప్రజా రవాణ బంద్ అవుతాయి. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలు ఇళ్లలోనే ఉండటం చాలా ముఖ్యం” అని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.

”ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కరోనా వైరస్ ని ఓడించేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, ఇచ్చే సలహాలు, సూచనలను ప్రజలు పాటించండి. పరిస్థితి చేయి దాటి పోకుండా మీ సహకారం కావాలి” అని సీఎం గెహ్లాల్ అన్నారు.

కరోనా వైరస్ వ్యాపించకుండా పంజాబ్, మహారాష్ట్ర సైతం ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మాల్స్ మూసివేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్న కరోనా, భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 332కి చేరింది. నలుగురు చనిపోయారు. 22 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరింది. ఏపీలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 22 రాష్ట్రాలకు మహమ్మారి విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 63 కరోనా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.