జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో శుక్రవారం(మార్చి-3,2019) ఉగ్రవాదులకు,భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన సీఆర్పీఎఫ్ ఇన్స్ పెక్టర్ పింటూ కుమార్ సింగ్ మృతదేహం ఆదివారం(మార్చి-3,2019) ఉదయం పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది.. పింటూ సింగ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన సోదరి,వదిన అక్కడికి వచ్చారు. అయితే అధికార ఎన్డీయే కూటమికి చెందిన మంత్రులెవరూ కూడా అమరవీరుడికి పుష్పాంజలి ఘటించేందుకు ఎయిర్ పోర్ట్ కి రాలేదు.
పీసీసీ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా, లోక్ జనశక్తి పార్టీ ఎంపీ చౌదరి మహబూబ్ అలీ ఖైసర్, ఎస్ఎస్పీ గరిమా మాలిక్, డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కుమార్ రవి, ఇతర సీఆర్పీఎఫ్ అధికారులు మాత్రమే ఎయిర్ పోర్టులో పింటూ కుమార్ సింగ్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత ఆయన పార్థివ శరీరాన్ని హెలీకాప్టర్ ద్వారా ఆయన సొంతూరు బేగూసరాయ్ జిల్లాలోని బఖ్రీ గ్రామానికి తరలించారు. బఖ్రీలో బేగూసరాయ్ డీఎం, ఎస్పీ తదితరులు వచ్చి నివాళులర్పించారు. తమ ఊరి వీరపుత్రునికి కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు తండోపతండాలుగా బఖ్రీ గ్రామానికి వచ్చారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన బీహార్ కి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు ఫిబ్రవరి-16న నివాళులర్పించేందుకు పాట్నా ఎయిర్ పోర్ట్ కి సీఎం నితీష్ కుమార్,డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ,కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ లు వెళ్లారు. అయితే ఆదివారం పలువురు కేంద్రమంత్రులు సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు పాట్నాలో ఉండి కూడా ఒక్కరు కూడా పింటూ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళ్లలేదు. ఆదివారం ప్రధాని మోడీ,సీఎం నితీష్ కుమార్ ల ఎన్నికల ర్యాలీ పాట్నాలో జరిగింది. పలువురు కేంద్రమంత్రులు కూడా సంకల్ప్ ర్యాలీలో పాల్గొనేందుకు పాట్నాలోనే ఉన్నారు. ప్రధాని మోడీని రిసీవ్ చేసుకునేందుకు మాత్రమే వీరు ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు.
అయితే సీఎం కానీ,ఏ ఒక్క మంత్రి కానీ అమరజవాన్ కు పుష్పాంజలి ఘటించేందుకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరవీరుడికి చివరిసారిగా శ్రద్ధాంజలి ఘటించేందు సీఎం రాకపోవడం చాలా దురదృష్టకరం అని దుర పింటూ కుమార్ మామ సంజయ్ సింగ్ అన్నారు. ర్యాలీ గురించి సీఎం బిజీగా ఉండి ఉంటే కనీసం డిప్యూటీ సీఎంని అయినా ఎయిర్ పోర్ట్ కి పంపించి ఉండాల్సిందని ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా ఉన్న ఎల్ జేపీ ఎంపీ అలీ ఖైసర్ అన్నారు.అమరుడైన జవాన్ కన్నా ప్రధాని ఎన్నికల ప్రచారానికే ప్రధాన్యత ఇచ్చారని పింటూ సోదరుడు తెలిపాడు.