Viral Video: ఐఐటీలోని మెస్‌లో ఎలుకలు.. చూసి వికారానికి గురైన విద్యార్థులు 

ఎలుకలు పాకిన కలుషిత ఆహారమే తమకు వడ్డించారని కొందరు ఆరోపించారు.

ఉత్తరాఖండ్‌ రూకీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కిచెన్‌ పాత్రల్లో ఎలుకలు కనపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టిట్యూట్‌లోని రాధా కృష్ణ భవన్‌లోని మెస్‌లో వంట పాత్రల్లో అవి కనపడ్డాయని విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో తెలిపారు.

అంతేగాక బియ్యం సంచుల్లో, విద్యార్థులకు ఆహారం వండడానికి ఉపయోగించే నీటితో నింపిన కుండలలో ఎలుకలను చూశామని చెప్పారు. గురువారం మధ్యాహ్నం తాము మెస్‌లో భోజనం చేసేందుకు వచ్చామని, తమలో కొందరు వంట గదిలోకి వెళ్లగా ఎలుకలు తిరుగుతూ కనపడ్డాయని తెలిపారు.

ఎలుకలు పాకిన కలుషిత ఆహారమే తమకు వడ్డించారని కొందరు ఆరోపించారు. ఇన్‌స్టిట్యూట్‌లో వీడియోలు వైరల్ అయ్యాక వందలాది మంది విద్యార్థులు మెస్‌ బయట ఆందోళనకు దిగారు. మెస్‌లో ఇటువంటి పరిస్థితులు రావడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఐఐటీ రూర్కీ అధికారులు మాత్రం కొట్టిపారేస్తున్నారు.

ఇది మిస్‌లీడింగ్‌ వీడియో అని అంటున్నారు. ఆ వీడియోపై వెంటనే విచారణ ప్రారంభించామని, పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకున్నారని ఐఐటీ-రూర్కీ మీడియా ఇన్‌ఛార్జ్ సోనికా శ్రీవాస్తవ అన్నారు. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడడానికి సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

Vladimir Putin : ఇండియన్ సినిమాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పుష్పతో తెలుగు సినిమాలకు కూడా..