Vladimir Putin : ఇండియన్ సినిమాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పుష్పతో తెలుగు సినిమాలకు కూడా..
తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియన్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Russia President Vladimir Putin
Vladimir Putin : ఇటీవల మన ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. తెలుగు సినిమాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఇండియన్ సినిమాలకు భారీ మార్కెట్ ఏర్పడింది. రష్యాలో కూడా ఇండియన్ సినిమాలకు ఇటీవల మంచి మార్కెట్ ఏర్పడింది. రెండేళ్ల క్రితం అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా రష్యాలో భారీగా రిలీజయి మంచి పేరు తెచ్చుకుంది. అప్పుడు బన్నీ అక్కడ ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు.
అయితే తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియన్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బ్రిక్స్ దేశాల సమ్మిట్ కి ముందు ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో పుతిన్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాలను రష్యా ప్రజలు బాగా ఇష్టపడతారు. మా దగ్గర కేవలం ఇండియన్ సినిమాలు మాత్రమే 24 గంటలు టెలికాస్ట్ చేసే ఓ టీవీ ఛానల్ కూడా ఉంది. త్వరలో బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ ని కూడా నిర్వహిస్తాము. ఇప్పటికే మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ సినిమాలు, బ్రిక్స్ దేశాల సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇండియన్ సినిమాలు మా దేశంలో ప్రమోట్ చేయడానికి మేము సానుకూలంగా ఉన్నాము. దానికోసం ఓ వేదికని కూడా స్థాపించనున్నాము. ఈ విషయంపై మా స్నేహితుడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతాము. అలాగే బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఓ థియేటరికల్ ఆర్ట్ ఫెస్టివల్ కూడా చేయడానికి సినిమా అకాడమీని స్థాపించాము అని అన్నారు.
Also Read : Krithi Shetty : మంచి కోసం కృతిశెట్టి.. ఆ ప్రోగ్రాంలో తల్లితో కలిసి పాల్గొని.. ఫొటోలు వైరల్..
దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలతో ఇండియన్ సినిమాలకు రష్యాలో మరింత మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నారు. పుష్ప ఆల్రెడీ అక్కడ రిలీజ్ చేశారు కాబట్టి త్వరలో రిలీజయ్యే పుష్ప 2 కూడా రష్యాలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలతో పుష్ప 2 కి అక్కడ మరింత రీచ్ దక్కుతుందని అనుకుంటున్నారు. పుష్ప 2 రష్యాలో విజయం సాధిస్తే ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలు కూడా అక్కడ మార్కెట్ ఓపెన్ చేస్తాయి. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలు రష్యాలో రెగ్యులర్ గా రిలీజ్ అవుతున్నాయి.