×
Ad

దేశంలో ఈ వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయోచ్‌..! నిత్యావసరాల ధరలు కూడా..

ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం, జీఎస్‌టీ సవరణల ప్రభావం, సరఫరా మెరుగుదల, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ధరలు మరింత తగ్గుతాయన్న సూచనలు కనపడుతున్నాయి.

Consumer Prices: దేశంలోని ప్రజలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నిత్యావసరాలతో పాటు, ఆహారేతర వస్తువులు, గృహోపకరణాలు, సర్వీస్‌ సెక్టార్‌లో ధరలు భారీగా తగ్గుతాయని తెలిపింది.

అక్టోబర్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) కనిష్ఠంగా 0.25%కి తగ్గింది. దీంతో ధరలు తగ్గనున్నాయని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఆర్‌బీఐ ద్రవ్య విధానంలో తీసుకున్న పలు చర్యలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో ఓ కారణంగా నిలిచాయి. అలాగే, జీఎస్‌టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర సర్కారు చేసిన సవరణలు కూడా ఇందుకు కారణమయ్యాయి.

ఆర్‌బీఐ హౌస్‌హోల్డ్‌ ఇన్‌ఫ్లుయేషన్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ సర్వే రిపోర్ట్‌ విడుదల చేసి ధరలకు సంబంధించి పలు వివరాలు తెలిపింది. నవంబర్‌ 1-10 వరకు దేశంలోని 19 సిటీల్లో 6,061 ఫ్యామిలీలపై ఈ సర్వే చేశారు. భవిష్యత్తులో ధరలు తగ్గి కస్టమర్లకు ఉపశమనం కలగనుందని అందులో తేలింది.

Also Read: Vaikuntha Ekadashi: ఉత్తర ద్వార దర్శన పూజల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనుకుంటున్నారా?

ఇప్పుడున్న ద్రవ్యోల్బణంపై ఫ్యామిలీల మధ్యస్థ అంచనా ఈ ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే 80 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. ఇప్పుడు అది 6.6 శాతానికి చేరింది. రాబోయే 3 నెలల్లో రేట్లు అధికమవుతాయన్న భావన 7.6 శాతానికి, ఒక ఏడాది అంచనా 8 శాతానికి తగ్గింది.

ఈ ఏడాది అక్టోబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 5 శాతానికి పడిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు భారీగా తగ్గాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు కస్టమర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనాలు చేకూర్చాయి.

ద్రవ్యోల్బణం తగ్గడంతో ఆర్‌బీఐ తాజాగా రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తెచ్చింది. దీంతో హోమ్‌ లోన్స్‌, వెహికిల్స్‌ లోన్స్‌, బిజినెస్‌ లోన్స్‌ కూడా తక్కువ వడ్డీకి దక్కే ఛాన్స్ ఉంది.

ఇలా ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం, జీఎస్‌టీ సవరణల ప్రభావం, సరఫరా మెరుగుదల, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ధరలు మరింత తగ్గుతాయన్న సూచనలు కనపడుతున్నాయి.