శ్రీరాముడు నేపాలీ..భారతీయుడు కాదు : నిజమైన అయోధ్య తమ దేశంలోనే ఉందన్న నేపాల్ ప్రధాని

చైనా మద్దతుతో కొన్నిరోజులుగా భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాలీ అని, ఆయన భారతీయుడు కాదన్నారు. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉన్నదని చెప్పారు.

నేపాల్ లోని బిర్గంజ్ పశ్చిమాన థోరి వద్ద ఉందని, వాల్మికి ఆశ్రమం కూడా నేపాల్ లో ఉంది మరియు కొడుకును పొందటానికి దశరథ మహారాజు కర్మలు చేసిన పవిత్ర స్థలం నేపాల్ లోని రిడిలో ఉంది అని నేపాల్ ప్రధాని చెప్పుకొచ్చారు.

ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు నేపాల్ మీడియా సోమవారం పేర్కొంది. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన జరుగనున్న నేపథ్యంలో కేపీ శర్మ ఓలీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఇటీవలే భారత్, నేపాల్ సరిహద్దులోని కొన్ని ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ ఒక కొత్త మ్యాప్‌ను నేపాల్ రూపొందించింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే దూరదర్శన్ తప్ప మిగిలిన భారత్‌ ప్రైవేట్ టీవీ చానల్స్‌పైనా నేపాల్ ప్రభుత్వం వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. మూడు రోజుల క్రితం భారత్‌ ప్రైవేట్ టీవీ చానల్స్ ప్రసారాలను నేపాల్ నిలిపివేసిన విషయం తెలిసిందే.

కాగా, భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న ప్రధాని కేపీ శర్మ ఓలీ తీరుపై అధికార నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ మండిపడుతున్నది. ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాలని పట్టుబడుతున్నది. ఆయన భవిష్యత్తును తేల్చేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశం కావాల్సి ఉండగా చైనా ఒత్తిడితో ఆ భేటీ పలుమార్లు వాయిదా పడింది.