1962లో జరిగింది గుర్తుతెచ్చుకోండి…గల్వాన్ ఘటనను రాజకీయం చేయవద్దని రాహుల్ కి పవార్ సూచన

దేశ భద్రత, సరిహద్దు వివాదాలను రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ కోరారు. దేశ భద్రత, సరిహద్దు వివాదాలపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.
ఈ తరుణంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ దీనిపై స్పందించారు. సరిహద్దుల్లో భారతదేశం-చైనా ప్రతిష్టంభనకు నెలకొన్న నేపథ్యంలో జాతీయ భద్రత విషయాలను రాజకీయం చేయవద్దని యూపీఏ కూటమి భాగస్వామి అయిన ఎన్సీపి చీఫ్ కాంగ్రెస్ కు సూచించారు.
1962 లో ఏమి జరిగిందో రాహుల్ గుర్తుంచుకోవాలన్న శరద్ పవార్
1962 భారత్- చైనా యుద్ధం అనంతరం 45,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఇది ఎప్పటికి మరచిపోలేమని, ప్రస్తుతం తీవ్రమైన ఆరోపణలను కాంగ్రెస్ చేస్తున్నప్పుడు, గతంలో ఏమి జరిగిందో కూడా పరిగణించాలి అని మాజీ రక్షణ మంత్రి అన్నారు. లడఖ్‌లోని .గల్వాన్ వ్యాలీలో ఇటీవల జరిగిన సరిహద్దు వాగ్వివాదంలో ప్రధాని నరేంద్ర మోడీ భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని రాహుల్ గాంధీ ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు పవార్ ఈ విధంగా స్పందించారు. చైనా నియంత్రణలో ఉన్న వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ జాతీయ భద్రత వంటి అంశాలను రాజకీయం చేయరాదని పవర్ పునరుద్ఘాటించారు.
పెట్రోలింగ్ సమయంలో భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారని, లడఖ్‌లో గల్వాన్ వ్యాలీ సంఘటనను రక్షణ మంత్రి వైఫల్యమని వెంటనే అనకూడదని తెలిపారు. దేశ భద్రత అంశాల్లో రాజకీయాలు తగదన్నారు. జూన్ 15 రాత్రి తూర్పు లడఖ్‌లో భారత్ చైనా సైకుల మధ్య జరిగిన హింసాత్మకంగా ఘటనలో 20 మంది భారత్ సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. చైనా వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగింది.
గాల్వాన్ పరిణామాలకు కేంద్రాన్ని నిందించలేము
గల్వాన్ వ్యాలీలో జరిగిన పరిణామాలకు కేంద్రాన్ని నిందించలేమని పవార్ తెలిపారు. మన భూభాగాన్ని ఆక్రమించటానికి ప్రయత్నించినప్పుడు చైనా సైనికులను వెనక్కి నెట్టడానికి మన జవాన్లు ప్రయత్నించినందున దీనిని నిందించలేమని పవార్ అన్నారు. దీనిని రక్షణ మంత్రి లేదా మరెవరైనా విఫలమయ్యారని చెప్పలేము అని తెలిపారు. .