ఢిల్లీ : ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సాధించుకున్న దేశ స్వరాజ్యం సిద్దించింది. ఈ క్రమంలో భారతదేశ చరిత్రలో మరో గొప్ప ఘనత గణతంత్ర దినోత్సవం. బ్రిటీష్‌వారి పరిపాలనలో బానిసలుగా మగ్గిపోయిన భారతీయులు స్వేచ్ఛావాయులు పీల్చుకున్నా రోజు ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. గణతంత్ర అంటే ప్రజలే ప్రభువులు..అదే ప్రజస్వామ్య దేశం.. ఆ గొప్ప సుదినం జనవరి 26. 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. ఆ గణతంత్ర దినోత్సవం సాధించిన గొప్ప విజయం పంచాయితీ రాజ్ వ్యవస్థ.
బాపూజీ కలలు..గ్రామాల అభివృద్ది..
70ఏళ్ల భారత గణతంత్ర సుదీర్ఘ ప్రస్థానంలో సాధించిన అతిగొప్ప విజయం పంచాయతీరాజ్ వ్యవస్థ. ఢిల్లీ పాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్యం లక్ష్యంతో మొదలైన పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా వరకు ఉద్దేశిత లక్ష్యాలను చేరుకుంది. జనాభాలో సగంగా ఉన్న మహిళలు ప్రస్తుతం 50% స్థానిక సంస్థలను పాలిస్తున్నారు. ఊరికి దూరంగా..వివక్షతో జీవితాలను గడిపిన దళితులు కూడా అధికారంలో భాగస్వాములయ్యారు. ఇలాంటి ఎన్నో విజయాలతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ..అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో వాటన్నింటినీ పరిష్కరించుకోగలిగితే ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా భారత్ ఆదర్శవంతమవుతుంది.
73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు
ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయి వరకు విస్తరింపచేయడానికి, స్వపరిపాలన ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. పాలనలో పంచాయతీ ప్రతినిధులు భాగస్వాములయ్యారు. గ్రామస్థాయి పాలనలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు సమచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ పంచాయితీ రాజ్ చట్టం ఎంతగానో ఉపయోగపడింది. తమ సమస్యలను తామే గుర్తించి వాటి పరిష్కారాలను కూడా తామే నిర్ణయించుకునే అధికారం పంచాయతీ ప్రతినిధులకు దక్కటంతో పాటు నిధుల వినియోగం, పాలనలో పారదర్శకతకు తోడ్పడింది. ఆ మేరకు రాష్ట్రాలు పంచాయతీలకు అవసరమైన అధికారాలు బదిలీ చేయడానికి వీలైంది. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తన అధికారులతో గ్రామ పాలన సాగించేది. అధికారులకు స్థానిక సమస్యల పట్ల అవగాహన లేమి కారణంగా గ్రామాభివృద్ధి కుంటుపడేది. గ్రామాలపై అధికారుల పెత్తనం కొనసాగేది. పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు, విధుల వికేంద్రీకరణ వల్ల అవి బలమైన పాలన కేంద్రాలుగా తయారవుతాయనడంలో సందేహం లేదు.స్థానికుల అవసరాలను తీర్చగలుగుతాయి. వారికి జవాబుదారీగా ఉంటాయి.
మహిళలే నేతలుగా
ప్రస్తుతం దేశంలో 2,32,332 గ్రామ పంచాయతీలు, 6000 మండల/సమితులు, 534 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు 27,75,858 మంది, మండల/సమితులకు 1,44,491 మంది, జిల్లా పరిషత్‌లకు 15,067 మంది ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. వీటిలో 75వేల పంచాయతీలు, 2వేల మండల పరిషత్‌లు 175 జిల్లా పరిషత్‌లకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. రిజర్వేషన్ల కారణంగా పలువురు ఎస్సీ,ఎస్టీలు కూడా స్థానిక సంస్థలకు ఎన్నికవుతున్నారు. పాలనలో భాగస్వాములవుతున్నారు. దేశ వ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ విజయవంతం అయినట్టు అధికారికి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.