tamilnadu Election 2021 : స్వాగతం పలికిన మహిళలు..షాక్ తిన్న అన్నాడీఎంకే అభ్యర్థి..! ఎందుకు ?

తనకు ఓట్లు వేయాలని ప్రచారం చేపడుతున్న అన్నాడీఎంకే అభ్యర్థికి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

tamilnadu Election 2021

AIADMK MLA : తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరందుకొంటోంది. హేమాహేమీలు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నేతలు నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేపడుతున్నారు. అయితే..తనకు ఓట్లు వేయాలని ప్రచారం చేపడుతున్న అన్నాడీఎంకే అభ్యర్థికి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఊహించిన విధంగా స్వాగంతం పలికారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

తమిళనాడులోని మధురై జిల్లా శోలవందన్ లో అన్నాడీఎంకే అభ్యర్థి మాణిక్కం ఎన్నికల ప్రచారం నిర్వహించాలని తలపెట్టారు. తాండలై గ్రామానికి వెళ్లారు. ఆయన అడుగు పెట్టగానే..ఓ 50 మంది మహిళలు లైన్ లో నిల్చొన్నారు. మహిళలు, చిన్నారులు ప్లేటులు పట్టుకుని నిలబడ్డారు. పూలతో స్వాగతం పలుకుతారని అందరూ ఊహించారు. కానీ..వారి ప్లేట్లలో ఉన్నవి రేషన్ బియ్యం. బియ్యం మధ్యలో హారతి వెలిగించారు. తమ ప్రాంతంలో ఉన్న రేషన్ షాపులో ఉన్న బియ్యాన్ని తీసుకొచ్చామని, ఇవి ఎంత నాసిరకంగా ఉన్నాయో..చూపెట్టడానికి ఇలా చేశామని వెల్లడించారు.

ఓట్లు అడగాలి అనుకున్న అభ్యర్థి మాణిక్కంను నిలదీశారు. ఇలాంటి బియ్యాన్ని ఎలా తింటామని, మా ఊరికి ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ఊళ్లో వాటర్ పైప్ ఉందా.. సరైన రోడ్లు ఉన్నాయా అనే విఫయం తెలుసా అన్నారు. గ్రామస్తులు నిలదీయడంతో..ఏం చేయాలో తెలియక..సదరు అభ్యర్థి..సమస్యలను పరిష్కరిస్తానంటూ చెప్పేసి వెళ్లిపోయారు.