Ayyapa Temple
శబరిమళ అయ్యప్ప ఆలయం ఆదాయం ఘననీయంగా పెరిగింది. మహిళలకు శబరిమళ అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులలోని మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయ ఆదాయం బాగా తగ్గిందన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సంవత్సరం మాత్రం కేవలం 28 రోజుల్లోనే రూ.104 కోట్లు ఇప్పటికే దాటేసింది.
నవంబరు 17వ తేదీ సాయంత్రం ఆలయాన్ని తెరవడంతో భక్తులు అప్పటి నుంచి పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆలయానికి వచ్చిన కానుకలతో పాటు ప్రసాదం అమ్మకాలతో కలిపి ఈ సంవత్సరం రూ.104 కోట్ల ఆదాయం సమకూరింది. గత సంవత్సరం రూ.64 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఆలయం తెరిచిన తొలిరోజే రూ. 3.30 కోట్లు ఆదాయం సమకూరినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ ఎన్ వాసు వెల్లడించారు. గత సంవత్సరం తొలిరోజు 2.04 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 50 శాతం ఆదాయం పెరిగిందని, భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని ఆయన తెలిపారు.