ప్రతీకారంతో రగిలిపోయే వాతావరణం జాగ్రత్త.. ప్రియాంక

‘ఇదసలే ప్రతీకారంతో రగిలిపోయే వాతావరణం జాగ్రత్తగా ఉండు ప్రియాంక’ అని ఆమె భర్త ఫేస్‌బుక్ ద్వారా పోస్టు చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యమే అయినా.. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉండి, ఒకేసారి కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టారు. తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ప్రియాంక గాంధీ రెండు వారాల క్రితమే రాజకీయాల్లోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా లక్నోలో రోడ్ షో చేసేందుకు సిద్ధమైయ్యారు ప్రియాంక. 

 

ఈ సందర్భంగా ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా భావోద్వేగపూరితంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘నువ్వు భార్యగానే కాదు, బెస్ట్ ఫ్రెండ్‌గానూ నాతో పాటు ఉన్నావు. ఓ తల్లిగానూ పిల్లలను చక్కగా చూసుకున్నావు. కానీ, ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నావు. ఇదంతా చాలా కక్షాపూరితమైన, ప్రతీకారేచ్చతో రగిలే వాతావరణం. కానీ, ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత నీపై ఉంది. అందుకే నిన్ను దేశం కోసం వెళ్లనిస్తున్నాము. ప్రియాంకను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ప్రజలను ఉద్దేశించిన వ్యాఖ్యతో ట్వీట్ ముగించారు. 

 

రాబర్ట్ వాద్రా మూడు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ)విచారణకు హాజరవుతున్నారు. లండన్‌లో అక్రమాస్తుల గురించి మరి కొన్ని కేసుల విషయంలో వివరణ ఇచ్చుకుంటున్నారు.