Car (Image Credit To Original Source)
Bengaluru: కేరళకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి న్యూఇయర్ వేడుక జరుపుకోవడానికి బెంగళూరుకు వచ్చి రచ్చరచ్చ చేశాడు. హెన్నూర్ రోడ్డుపై కారును నడిపించాడు. ఆ కారు ఎగ్జాస్ట్ నుంచి మంటలు వచ్చాయి. చెవులకు చిల్లులు పడేలా శబ్దం చేస్తూ అతడు కారును నడిపిన తీరుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇలా చేస్తే సామాజిక మాధ్యమాల్లో తాను హీరో అయిపోతానని అనుకున్నాడు. స్థానికులు ఈ వీడియోలు తీసి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరులోని భారతి నగర్-హెన్నూర్ రోడ్డుపై ఆ విద్యార్థి కారును నడిపించాడని పోలీసులు తెలిపారు. కారు నుంచి భరించలేని శబ్దం రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.
Also Read: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా.. దేశవ్యాప్తంగా లుంగీలతో ఆ పార్టీ నేతల సంబరాలు.. ఎందుకంటే?
అతడు మోటార్ వాహన చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డాడని అధికారులు నిర్ధారించారు. అనుమతి లేకుండా కార్ సైలెన్సర్ మార్పులు చేయడం, వాహన రంగు మార్చడం ఈ ఉల్లంఘనల్లో ఉన్నాయి. ఈ ఉల్లంఘనలు జనవరి 2న వెలుగులోకి వచ్చాయి. ఆ వాహనంపై అనేక ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు.
కన్నూర్ జిల్లాకు చెందిన ఆ యువకుడు 2002 హోండా సిటీ కారును రూ.70,000కు కొనుగోలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా కారులో మార్పులు చేశాడు. ఆ పాత కారు నుంచి భారీ శబ్దం వచ్చేలా, మంటలు వెలువడేలా మార్చాడు.
“బ్యాంగర్” గ్రాఫిటీ వేయించుకున్నాడు. ఈ నిబంధనల ఉల్లంఘనల కింద అతడికి యెలహంక ప్రాంతీయ రవాణా కార్యాలయం రూ.1.11 లక్షల జరిమానా విధించింది. అతడు ఆ జరిమానాను చెల్లించాడు. ఆ విద్యార్థి వద్ద ఉన్న డ్రైవర్ లైసెన్స్‌ను కూడా అధికారులు రద్దు చేశారు.