Maharasta Bus accident
RTC Bus Disaster: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌టిసి) బస్సు వేగంగా వచ్చి ఏడు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఇద్దరు వాహనదారులు సజీవదహనమయ్యారు. నాసిక్-పుణె హైవేపై పాల్సే గ్రామ సమీపంలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ చూస్తుండగానే బస్సుదగ్దమైంది. ఈ ప్రమాదంకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోవైరల్ గా మారాయి.
పుణె జిల్లాలోని రాజ్ గురునగర్ నుంచి నాశిక్ కు ఎంఎస్ఆర్టీసీకి చెందిన బస్సు వెళ్తోంది. పాల్సే గ్రామం సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో సిగ్నల్ వద్ద ఆగియున్న వాహనాలపైకి బస్సు వేగంగా దూసుకెళ్లింది. తొలుత నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు ఎస్ యూవీ వాహనాలను ఢీకొట్టింది. ఆ తరువాత వేగంగా వెళ్లి ముందున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య రెండు బైక్ లు చిక్కుకొని మంటలు చెలరేగాయి.
CCTV footage of ST bus accident at Palase on Nashik-Pune highway#Accident #CCTV #Nashik_pune_Highway#Nashik #Sinnar #Palse pic.twitter.com/9BaKJ0JMUo
— पाटील 🤗 (@PareshPatil11) December 8, 2022
మంటల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. రాజ్‌గురునగర్ నుంచి వచ్చిన బస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. వారు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు. రోడ్డు ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బస్సులో ప్రయాణిస్తున్న కొందరికి స్వల్పగాయాలు కావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. బ్రేకులు ఫెయిల్ కావటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.