Sadhguru Jaggi Vasudev : సద్గురుకు బ్రెయిన్‌లో బ్లీడింగ్‌.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో సర్జరీ.. ఇషా ఫౌండేషన్ ప్రకటన!

Sadhguru Jaggi Vasudev : సద్గురు జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని, ఈ క్రమంలోనే సద్గురుకు మెదడులో బ్లీడింగ్ ఉందని గుర్తించి వెంటనే సర్జరీ నిర్వహించినట్టు ఇషా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

Sadhguru Jaggi Vasudev : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. గత నాలుగు వారాలుగా ఆయన తీవ్ర తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవీలే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే సద్గురు ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. సద్గురుకు మెదడులో బ్లీడింగ్, వాపు ఉందని గుర్తించిన అపోలో వైద్యులు ఆయనకు వెంటనే సర్జరీ నిర్వహించినట్టు తెలిపారు.

ఇదే విషయాన్ని ఇషా ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం మెరుగుపడుతోందని న్యూరో సర్జన్లు పేర్కొన్నారు. సద్గురు మెదడులో బ్లీడింగ్ కారణంగా ఆయనకు ప్రాణాంతకమైన పరిస్థితి నెలకొందని చెప్పారు. సద్గురుకు సీటీ స్కాన్‌ చేయగా మెదడులో బ్లీడింగ్, వాపు ఉందని నిర్ధారణ అయిందని అపోలో వైద్యులు తెలిపారు.

తీవ్ర తలనొప్పితో ఆస్పత్రిలో చేరిన సద్గురు :
ఇషా ఫౌండేషన్ ప్రకటన ప్రకారం.. సద్గురు నెలరోజులుగా తీవ్ర తలనొప్పి ఉన్నప్పటికీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించారు. నొప్పి తీవ్రంగా ఉన్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఈ నెల 8 రాత్రిపూట మహాశివరాత్రి వేడుకలను కూడా ఆయన నిర్వహించారు. మార్చి 14వ తేదీ మధ్యాహ్నానికి ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు తలనొప్పి తీవ్రమైంది’ అని పేర్కొంది. ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ వినిత్ సూరి సలహా మేరకు.. సద్గురు అత్యవసరంగా ఎంఆర్ఐ చేయించుకున్నారు. అప్పుడు ఆయన మెదడులో భారీ రక్తస్రావం ఉన్నట్టు బయటపడినట్టు తెలిపింది.

టెస్టుకు ముందు తీవ్ర రక్తస్రావం కనిపించిందని నివేదిక పేర్కొంది. అయితే, సద్గురు పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయకుండా ఆస్పత్రిలో చేరడానికి నిరాకరించారని నివేదిక వెల్లడించింది. మార్చి 17న సద్గురు తన ఎడమ కాలు బలహీనంగా ఉందని, నిరంతరాయంగా వాంతులతో తలనొప్పి తీవ్రమై ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. వైద్యుల సలహా మేరకు చివరికి సద్గురు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. సిటీ స్కాన్ చేయించుకోగా మెదడులో వాపు ఉందని గుర్తించిన వైద్యులు కొన్ని గంటల్లోనే ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేశారు.

సర్జరీ అనంతరం.. సద్గురు ఆస్పత్రిలో మాట్లాడుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ‘అపోలో ఆస్పత్రి న్యూరో సర్జన్లు నా పుర్రెను కోసి ఏదో వెతకడానికి ప్రయత్నించారు. కానీ, వారికి ఏమీ కనిపించలేదు. పూర్తిగా ఖాళీగా ఉంది’ అని సద్గురు తన ఆసుపత్రి బెడ్‌పై నుంచి చమత్కరించారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఆస్పత్రిలోనే ఉన్నానని, వైద్యులు ఆపరేషన్ చేశారని, ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు