Saif Ali Khan Attack Case
Saif Ali Khan Attack Case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడిచేసిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 72గంటల వెతుకులాట అనంతరం ఆదివారం తెల్లవారు జామున ముంబైలోని థానే నగర శివారులో చెట్ల పొదల్లో దాక్కొని ఉండగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా నిందితుడికి ఈనెల 24వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా, అతని పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ గా ముంబై పోలీసులు గుర్తించారు. అతడు అక్రమంగా భారతదేశంలో చొరబడ్డాడు.
అక్రమంగా బంగ్లాదేశ్ లోకి చొరబడిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ 2024 జూన్ నెలలో ఉద్యోగంకోసం అతని పేరును బిజోయ్ దాస్ గా మార్చుకున్నాడు. ఆగస్టులో దొంగతనం కారణంగా ఓ రెస్టారెంట్ నుంచి బిజోయ్ దాస్ ను తొలగించారు. ఆ తరువాత ఓ ఏజెన్సీలో హౌస్ కీపర్ గా డిసెంబర్ వరకు పనిచేశాడు. ఆ తరువాత థానేలో తిరుగుతూ దొంగతనాల కోసం రెక్కీలను నిర్వహించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడి ఫోన్ ను తనిఖీ చేయగా.. అతని పుట్టిన ధృవీకరణ పత్రం, జాతీయత కార్డు, కుటుంబ వివరాలను పోలీసులు గుర్తించారు. ధనవంతులు, ప్రముఖులు బాంద్రా ప్రాంతంలో ఉంటారని తెలుసుకొని అక్కడ దొంగతనం చేసేందుకు నిందితుడు నిర్ణయించుకున్నాడు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన సమయంలో అతనికి అది సైప్ ఇల్లు అని తెలియదని విచారణలో తేలిందని పోలీసుల తెలిపారు.
సైఫ్ ఇంట్లో దొంగతనం చేసి తప్పించుకున్న తరువాత షరీఫుల్ బాంద్రా స్టేషన్ నుండి దాదర్ వరకు రైలు ద్వారా ప్రయాణించాడు. దాదాపు ఐదున్నర గంటలపాటు బాంద్రా, ఖార్ ప్రాంతంలో తిరిగాడు. ఆ తరువాత హెయిర్ కట్ చేసి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. సీసీ కెమెరాలను తనిఖీ చేయగా.. బాంద్రా వెస్ట్ లోని లింకింగ్ రోడ్డులోని సాధు వాస్వానీ పెట్రోల్ పంపు సమీపంలో నిందితుడిని గుర్తించామని పోలీసులు తెలిపారు. రోడ్డుదాటుతున్న క్రమంలో సీసీ కెమెరాల్లో రికార్డయింది. తెల్లవారు జామున 4గంటల సమయంలో ఖార్ రోడ్ రైల్వే స్టేషన్లో పడుకున్నాడు. ఉదయం బాంద్రాకు తిరిగివచ్చాడు.
నిందితుడి జాడ కనుగొనేందుకు పోలీసులు 500 సీసీ పుటేజీలను పరిశీలించారు. డీసీపీ దీక్షిత్ నేతృత్వంలోని బృందం సైఫ్ అలీఖాన్ ఇంటి నుంచి లింకింగ్ రోడ్డు, బాంద్రా స్టేషన్, దాదర్, వర్లీ వైపు వెళ్లే మార్గాల్లో అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. వీటన్నింటిలో నిందితుడిని కనుగొన్న ప్రాంతాల్లో అతని కాలుకు వేసుకున్న షూ కలర్ ఒకే రకంగా ఉన్నాయి. మూడు గంటలపాటు అన్ని సీసీ పుటేజీల్లో నిందితుడి షూ కలర్, షూ పరిమాణాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరీక్షించారు. నేషనల్ కాలేజీకి సమీపంలో ఉన్న సీసీటీవీ పుటేజీలో నిందితుడిని గుర్తించిన పోలీసులు.. సైఫ్ అలీఖాన్ ఇంటివద్ద సీసీ కెమెరాల్లో పోలిన విధంగానే అతను ఉండటంతో నిందితుడిగా నిర్ధారించారు. నిందితుడు దొంగతనానికి పాల్పడిన సమయం నుంచి నిందితుడిని పట్టుకునే ప్రాంతం వరకు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా అతన్ని జాడను గుర్తించారు.
థానేలో, నగర శివార్లలో విస్తృత తనిఖీలు నిర్వహించిన తరువాత ఈ ప్రాంతంలో నిందితుడు లేడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే, కొన్ని ఎకరాల భూమిలో ముళ్ల పొదలతో నిండిఉంది. ఆ ప్రాంతంలో రాత్రి సమయం కావడంతో టార్చ్ లైట్ వేసి వెతుకులాట ప్రారంభించగా.. పొదల్లో దాక్కొనిఉన్న నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే, దొంగతనంకు యత్నించే కంటే ముందు అతనికి అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది. దొంగతనం చేసి ఆ డబ్బుతో బంగ్లాదేశ్ కు పారిపోవాలని నిందితుడు ప్లాన్ వేశాడని ఓ పోలీస్ అధికారులు తెలిపారు.