Dharmendra Pradhan : ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

కొన్ని రోజులుగా దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి.

Dharmendra Pradhan కొన్ని రోజులుగా దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ కొన్ని పైసలు పెరుగుతూ పలు రాష్ట్రాల్లో సెంచరీ దాటిన ఇంధన ధరలు.. మరికొన్ని రాష్ట్రాల్లో వందకు చేరువలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు ఆదా చేస్తున్నందునే పెట్రో ధరల పెంపును ఉపేక్షించాల్సి వస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సమస్యాత్మకం అయినప్పటికీ ప్రజలు దీన్ని ఆమోదించాలన్నారు.

ఆదివారం ధర్మేంద్ర ప్రధాన్ మీడియతో మాట్లాడుతూ…ప్రస్తుత ఇంధన ధరలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే విషయాన్ని అంగీకరిస్తున్నా. అయితే ఏడాదిలో వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లుకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో సంక్షేమ పథకాల అమలు కోసం మేం డబ్బులను కాపాడుతున్నాం. పేద ప్రజలకు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఎనిమిది నెలల పాటు ఆహార ధాన్యాలు అందించేందుకు మోడీ సర్కార్ లక్ష కోట్లు ఖర్చు పెట్టింది. పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో వేలాది కోట్ల రూపాయలను వేశాం. ఇటీవల రబీ పంటలకు కనీస మద్దతు ధరనూ పెంచాం. ఇవన్నీ ఒకే సంవత్సరంలో చేశామనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

ఇంధన ధరల పెరుగుదలపై నిత్యం విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్..సామాన్యులపై భారం గురించి కాంగ్రెస్ ఆందోళన చెందుతుంటే రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సేల్స్ ట్యాక్స్ ను తగ్గించాలన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలలో ఇంధన ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. ముంబైలో ఇంధన ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున, పేదల గురించి ఆయన అంతగా ఆందోళన చెందుతుంటే పన్నులు తగ్గించాలని మహారాష్ట్ర సీఎంకు రాహుల్ సూచించాలని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు