Sawai Madhopur : బాబోయ్.. ఇదేం విధ్వంసం.. అకస్మాత్తుగా 55 అడుగుల లోతుకు కుంగిపోయిన భూమి.. వీడియో వైరల్

Sawai Madhopur : రాజస్థాన్ రాష్ట్రంలో భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో సర్వాల్ జలాశయంకు వరద నీరు పోటెత్తడంతో..

Sawai Madhopur

Sawai Madhopur : దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో సర్వాల్ జలాశయం పొంగి పొర్లింది. నీటి ఉధృతికి రెండు కిలో మీటర్ల పొడువు, 100 అడుగుల వెడల్పుతో 55 అడుగుల లోతున భారీ గొయ్యి (బిలం) ఏర్పడింది. రాజస్థాన్ రాష్ట్రం సువాయ్ మాధోపూర్  (Sawai Madhopur) గ్రామం పరిధిలో జదవత ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: ధర్మస్థల కేసులో సంచలనం.. ఫిర్యాదుదారుడి అరెస్ట్.. అతడి మాటలు నమ్మి చెప్పిన చోటల్లా తవ్విన పోలీసులు.. చివరికి..

గత మూడు రోజులుగా సవాయి మాధోపూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. సర్వాయ్ జలాశయంకు వరద పోటెత్తడంతో వరద ఉధృతికి జాదవత గ్రామంలోని పొలాల్లో 55 అడుగుల లోతులో భూమి కుంగిపోయింది. పొలంలోని చెట్లు, స్థానికంగా ఉన్న పలు ఇళ్లు భారీ గుంతలోకి వెళ్లిపోయాయి. దీంతో గ్రామంలోని ప్రజలతోపాటు.. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ గుంత ఎక్కువగా విస్తరిస్తే గ్రామంలోని ఇళ్లు భూమిలోకి కూరుకుపోతాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఆ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.


ఘటన స్థలికి మంత్రి డాక్టర్ కిరోడి లాల్ మీనా, కలెక్టర్, ఎస్పీ, ఎస్డీఎం, తహసీల్దార్, విపత్తు నిర్వహణ బృందాలు చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ గుంతను పూడ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. అయితే, సహాయక చర్యల్లో వేగం పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేదంటే గ్రామంలోని ఇళ్లు ఆ భారీ గుంతలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచిఉందని ఆందోళన చెందుతున్నారు.