SBI : నెట్, మొబైల్ బ్యాంకింగ్ వాడేవారికి ఎస్బీఐ హెచ్చరిక.. ఆ తప్పు చేయొద్దు

ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ క్రిమినల్స్ అడ్డంగా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముని మనకు తెలియకుండానే ఖాళీ

Sbi Warns

SBI Warns : ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ క్రిమినల్స్ అడ్డంగా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముని మనకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన కస్టమర్లను హెచ్చరించింది.

నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించే కస్టమర్లు బలమైన పాస్ వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. పుట్టిన తేదీ, వెడ్డింగ్ డేట్, పిల్లలు, భాగస్వామి పేర్లను పాస్ వర్డ్ గా పెట్టుకోవద్దని సూచించింది.

పాస్ వర్డ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఎక్కువగా సెక్యూరిటీ ఉంటుంది. అన్ బ్రేకబుల్ పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి 8 మార్గాలు తెలుపుతున్నాము. ఇలా పాస్ వర్డ్ సెట్ చేసుకుని సైబర్ క్రైమ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి…అంటూ ఎస్బీఐ ఓ వీడియోని షేర్ చేసింది.

చాలామంది పాస్ వర్డ్ గుర్తుపెట్టుకోవడానికి వీలుగా సులభంగా ఉండేలా క్రియేట్ చేసుకుంటారు. వారి పుట్టిన రోజు లేదా పిల్లల పేర్లు, లేదా పెళ్లి తేదీని పాస్ వర్డ్ గా పెట్టుకుంటూ ఉంటారు. అయితే అలాంటి పాస్ వర్డ్ లతో చాలా ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ క్రిమినల్స్ అలాంటి పాస్ వర్డ్ లను ఈజీగా బ్రేక్ చేయగలరని హెచ్చరించారు. అందుకే పాస్ వర్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అసలు ఎలాంటి పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలో తెలియజేస్తున్నారు.

సైబర్ కేటుగాళ్ల బారి నుంచి మన బ్యాంక్ ఖాతాలు కాపాడేది మన పాస్ వర్డ్ మాత్రమే. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ఏదైనా మీ పాస్ వర్డ్ బలంగా ఉంటే ముందు జాగ్రత్త తీసుకున్నట్లే లెక్క. అయితే, చాలామందికి పాస్ వర్డ్ మర్చిపోతామనే భయంతో సులభంగా సెట్ చేసుకోవడానికే మొగ్గుచూపుతారు.

చాలా మంది పాస్‌వర్డ్‌ అనగానే 12345678 వంటి అంకెలు.. abcdefg వరస లెటర్లు పెట్టుకుంటారు. ఇలాంటి పాస్‌వర్డులు పెట్టారంటే.. హ్యాకర్లకు పండగే. అంతేకాదు పేరు, పుట్టిన తేదీ, కుటుంబసభ్యుల పేర్లు, పుట్టిన సంవత్సరం వంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోవడం కూడా ప్రమాదమే. ఎందుకంటే ఇవి సైబర్ నేరగాళ్లు సులభంగా పసిగట్టేస్తారు. ఇలాంటి సులభమైన పాస్ వర్డ్స్ పెట్టుకునే కస్టమర్లను ఎస్బీఐ అలెర్ట్ చేసింది.

* ఎస్బీఐ ఖాతాదారులు ఎప్పుడైనా క్యాపిటల్‌, స్మాల్‌ లెటర్స్‌ కలిపి ఉండేలా (aBjsE7uG) పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి.
* లేదంటే అక్షరాలు, అంకెలు, సంజ్ఞలు వంటిని కలిపి (AbjsE7uG61!@) పాస్ వర్డ్స్ పెట్టుకోవాలి.
* దీంతో పాటు పాస్‌వర్డ్‌లో కనీసం 8 క్యారెక్టర్స్‌ ఉండేలా చూసుకుంటూ itislocked, thisismypassword వంటి డిక్షనరీకి దొరికే పదాలను వాడకూడదు.
* కీబోర్డులో వరుసగా ఉండేలా qwerty, asdfg వంటివి ఉండకూడదు.
* కావాలంటే “:)”, “:/” ఇలా భావోద్వేగాల చిహ్నలను పాస్ వర్డ్ గా వాడుకోవచ్చని ఎస్బీఐ సూచించింది.