అన్ని పిటీషన్లను జనవరి 22న విచారిస్తాం : సుప్రీం కోర్టు

  • Publish Date - January 10, 2020 / 10:50 AM IST

సీఏఏ-పౌరసత్వ సవరణ చట్టంకి వ్యతరేకంగా వివిధ కోర్టుల్లో దాఖలైన అన్నీ పిటీషన్లను జనవరి 22 న విచారించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. పలు కోర్టుల్లో ఈఅంశంపై పిటీషన్లు దాఖలు చేసిన అందరికీ సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సీఏఏకి సంబంధించి  దేశంలోని పలు రాష్ట్రాల్లోని  హైకోర్టుల్లో పెండింగ్‌లో అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన పిటిషన్‌పై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  

దీనిపై సమాధానం చెప్పాలంటూ పిటిషనర్లను సుప్రీం ఆదేశించింది. కేంద్రం వేసిన పిటిషన్‌తో పాటు సీఏఏపై దాఖలైన అన్ని పిటిషన్లను ఈ నెల 22న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని  ధర్మాసనం పేర్కొంది. ఒకే అంశంపై పలు హైకోర్టుల్లో రకరకాలుగా దర్యాప్తు సాగే అవకాశం ఉన్నందున… ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టాలంటూ కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా విన్నవించారు. కాగా సీఏఏని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రస్తుతం 60కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి.

కాగా…. దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు ర్యాలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ముస్లిం యునైటెడ్ యాక్షన్ కమిటీ  ఆధ్వర్యంలో హైదరాబాద్ లోసీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ముస్లింలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మీరాలం ఈద్గాలో  ప్రత్యేక ప్రార్థనల జరిపిన అనంతరం ఈ ర్యాలీ ప్రారంభమైంది. ముస్లిం యువత, మహిళలు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలతో ర్యాలీకి హాజరయ్యారు. ఈ నిరసన ప్రదర్శనలో సుమారు 40వేల మంది పాల్గొన్నట్లుల తెలుస్తోంది.  భారీ ర్యాలీ నేపథ్యంలో నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘనటనలు జరగకుండా  పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Also Read : రేపు అమరావతికి నిజ నిర్ధారణ కమిటీ

హైదరాబాద్, సైబరాబాద్  కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ర్యాలీ అనంతరం జరిగే బహిరంగ సభలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తో సహా పలువురు నేతలు ప్రసంగించనున్నారు. కాగా…  సీఏఏను వ్యతిరేకిస్తూ ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతించొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. మిరాలం నుంచి శాంతిపురం వరకే ర్యాలీకి అనుమతిచ్చామని కోర్టుకు పోలీసులు తెలిపారు.

మరో వైపు తమిళనాడులోని చెన్నై,నందనంలో  పలు ముస్లింసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.