శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశంపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు

  • Publish Date - November 13, 2019 / 10:17 AM IST

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించటంపై  దాఖలైన రివ్యూ  పిటీషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమల రివ్యూ పిటీషన్లపై విచారణ జరిపింది.  చీఫ్ జస్టిస్ రంజన్  గొగోయ్‌తో పాటు జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా తదితరులు ఈ ధర్మాసనంలో ఉన్నారు. 

అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని సెప్టెంబర్ 28, 2018 లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పునః సమీక్షించాలని సుప్రీంకోర్టులో మొత్తం 64 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. రివ్యూ పిటీషన్లపై వాదనలు విన్న ధర్మాసనం 2019, ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వులో  పెట్టింది. ఎన్నోఏళ్లుగా  కొనసాగుతున్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ఆచారాలు, సంస్కృతిని పరిరక్షించాలని పీటీషనర్ల సుప్రీం కోర్టును కోరారు. మరోవైపు నవంబర్ 16 నుంచి మండల పూజ ప్రారంభమవుతున్నందున ఆలయాన్ని తెరుస్తారు. ఆలయం వద్ద ఎటువంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  కేరళ పోలీసులు 10వేల మంది  సిబ్బందితో  శబరిమలలో  పటిష్ట భద్రతా ఏర్పాటు చేసారు.

కాగా…. అయోధ్య తీర్పును గౌరవించినట్లే  శబరిమల ఆలయంలోకి అన్నివయస్సుల మహిళలను అనుమతించటంపై సుప్రీం కోర్టు గురువారం ఇచ్చే తీర్పును అందరూ  స్వాగతించాలని కేరళ దేవస్వోం  మంత్రి కడకంపల్లి సురేంద్రన్ బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేశారు.