Image Credit - ANI
India Mock Drill: దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. కేంద్రం ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 244 జిల్లాల్లో 259 చోట్ల మాక్ డ్రిల్స్ కండక్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖలో మాక్ డ్రిల్స్ చేపట్టారు. హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ డీఆర్డీవో, మౌలాలిలో మాక్ డ్రిల్స్ జరిగాయి. వైమానిక దాడులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్స్ చేశారు. విపత్తు ఎదురైన వేళ ఏ విధంగా తమను తాము కాపాడుకోవాలి అనేదానిపై ప్రజలకు, విద్యార్థులకు శిక్ష ఇచ్చారు అధికారులు.
భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. సుమారు 50 ఏళ్ల తర్వాత మరొకసారి దేశవ్యాప్తంగా ఒక సైరన్ మోగింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ పౌరులను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలను అప్రమత్తం చేయడమే మాక్ డ్రిల్స్ లక్ష్యం. ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో ప్రజలకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే మాక్ డ్రిల్స్ ఉద్దేశం.
శత్రువు దాడులు జరిపినప్పుడు, ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, వైమానిక దాడుల సమయంలో ప్రజలు ఏ విధంగా అప్రమత్తం కావాలి, తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి, తమకు తాము ఏ విధంగా రక్షణ కల్పించుకోవాలి అన్నదానిపై అధికారులు శిక్షణ ఇచ్చారు. మరోవైపు గాయపడిన వారిని ఏ విధంగా ఆసుపత్రులకు తరలించాలి, వారికి ఏ విధంగా చికిత్స అందించాలి, ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి.. వీటన్నింటిపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీస్, అగ్నిమాపక, రెస్క్యూ టీమ్స్, వైద్య, రెవెన్యూ, ఆర్మీ అధికారులు మాక్ డ్రిల్స్ లో పాల్గొన్నారు.
హైదరాబాద్ లో ప్రతి జంక్షన్ లో 2 నిమిషాల పాటు సైరన్లు మోగాయి. పోలీసులు, డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. విపత్తు వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు.