Mumbai port: మరోసారి బయటపడ్డ చైనా, పాకిస్థాన్ కుట్రలు.. భారత నేవీ పటిష్ఠ బందోబస్తు

కవ్వింపు చర్యలను కట్టడిచేయడంతో పాటు శత్రువులను కనిపెట్టేందుకు నిఘాపెంచాయి భారత భద్రతా బలగాలు.

China-Pak

ఆ రెండు దేశాల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే, ఉమ్మడి శత్రువు కూడా ఒక్కటే. ఏం చేసైనా భారత్ ను నిలువరించాలి. అంతర్జాయతీయంగా భారత్ కు వస్తోన్న పేరు, ప్రతిష్ఠలను దిగజార్చాలి. అభివృద్ధివైపు దూసుకెళ్తున్న భారత్ దృష్టిని మళ్లించడమే టార్గెట్‌గా పనిచేస్తున్నాయి చైనా, పాకిస్థాన్.

అంతర్గత అభివృద్ధితో పాటు అంతర్జాతీయంగా పేరు సంపాదిస్తోన్న భారత్ ను కుట్రలతో దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఉగ్రకుట్రలతో పాటు బార్డర్ లో కవ్వింపు చర్యలు చేస్తూ..మరోవైపు భారత్ పై దాడికి అణ్వాయుధ సామాగ్రి సమకూర్చుకుంటోంది దాయాది దేశం. చైనా, పాక్ రెండు దేశాలు మనకు బార్డర్ కలిగి ఉండటంతో పాటు.. వీటి సరుకు రవాణా నౌకలు కూడా మనకు ప్రధానమైన అరేబియా సముద్రమార్గంలోనే ప్రయాణిస్తాయి. మనకూ ముఖ్యమైన ఆ సముద్రమార్గంలోనే మనపై కుట్ర చేస్తున్నాయి ఈ రెండు దేశాలు.

బార్డర్ లోనూ చైనా, పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతటితో ఆగకుండా భారత్ ను లక్ష్యంగా చేసుకుని.. పాక్ చేసే కుట్రలకు చైనా అండదండలు అందిస్తోంది. భారత్ ను కొట్టడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న పాకిస్థాన్ కు గుట్టుచప్పుడు కాకుండా ఆయుధాలు సమకూరుస్తోంది చైనా. అంతర్గతంగా పాక్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది డ్రాగన్ కంట్రీ. ముంబై ఓడరేవులో ఆపిన నౌక నుంచి స్వాధీనం చేసుకున్న సరుకు.. మరోసారి చైనా పాక్ కుట్రలను బయటపడేలా చేసింది.

చైనా సహకారంతో..
భవిష్యత్ లో భారత్ పై ఉపయోగించేందుకు అణ్వస్త్రాలను రెడీ చేసుకుంటోంది పాక్. అందుకు చైనా సహకారం అందిస్తోంది. చైనా టు పాకిస్తాన్ వయా ముంబై వెళ్తున్న నౌకలో దొరికిన పరికరాలు చూస్తే.. దాయాది దాగుడుమూతలు తెలుస్తున్నాయి. ముంబై పోర్టులో నిలిపేసిన నౌకలో కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్ కు సంబంధించిన సరుకు గుర్తించారు అధికారులు.

ఇటాలియన్ కంపెనీలో తయారైన CNC మిషన్‌ను..అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు కంప్యూటర్ ద్వారా నియంత్రిస్తారని DRDO దర్యాప్తులో తేల్చింది. ఈ నౌకలో ఉన్న సరుకు దాయాది దేశం అణుకార్యక్రమాల కోసం ఉపయోగపడుతుందని నిర్ధారణకు వచ్చారు. క్షిపణిని తయారుచేయడానికి కావాల్సిన కీలకమైన భాగాలు..సీజ్ చేసిన పరికరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. CNC మిషన్‌ను ఉత్తరకొరియా అణు కార్యక్రమాల్లో ఉపయోగిస్తోందని చెబుతున్నారు అధికారులు. అలాంటి మిషన్ను పాక్ కు తరలిస్తున్నట్లు గుర్తించారు.

రక్షణ పరికరాల సరఫరా
లోడింగ్, ఇతర డాక్యుమెంట్స్ పరిశీలించిన అధికారులకు ప్రాథమిక విచారణలో కీలక విషయాలు తెలిశాయి. 22వేల 180 కిలోల సరుకు తైవాన్ మైనింగ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ కో లిమిటెడ్ నుంచి..పాకిస్తాన్‌లోని కాస్మోస్ ఇంజనీరింగ్ కోసం పంపుతున్నట్లు గుర్తించారు. కాస్మోస్ ఇంజనీరింగ్ సంస్థ పాకిస్తాన్‌కి రక్షణ పరికరాలు సరఫరా చేస్తుంది. ఆ కాస్మోస్ ఇంజనీరింగ్ సంస్థకు ఈ పరికరాలు సప్లై అవుతున్నాయంటే ఇది పక్కాగా అణుక్షిపణి ఎక్విప్ మెంటేనని భావిస్తున్నారు DRDO అధికారులు.

చైనా నుంచి పాకిస్తాన్‌కి ఎగుమతి అవుతున్న డ్యూయల్ యూజ్ మిలిటరీ గ్రేడ్ వస్తువులను భారత అధికారులు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 12, 2022లో నవ షేవా పోర్టులోనే ఇటాలియన్ కంపెనీకి చెందిన థర్మోఎలెక్ట్రిక్ పరికరాలను సీజ్ చేశారు అధికారులు. ఫిబ్రవరి 2020లో చైనా ఇండస్ట్రియల్ డ్రైయర్ కింద పాకిస్తాన్‌కు ఆటోక్లేవ్‌ను సరఫరా చేసింది.

ఆటోక్లేవ్‌ని కూడా పాకిస్థాన్ క్షిపణి కార్యక్రమంలో ఉపయోగించేందుకేనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్థాన్ క్షిపణుల అక్రమ వ్యాపారానికి పాల్పడుతోందని, మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ ని ఉల్లంఘిస్తోందనే భారత్ ఎప్పటినుంచో స్పష్టం చేస్తోంది.

పాకిస్థాన్ అణు, క్షిపణి కార్యక్రమాలకు చైనా మద్దతు ఇవ్వడం ఆందోళనకరంగా మారింది. ఐరోపా, యూఎస్ నుంచి నిషేధిత వస్తువులను కొనడానికి, చైనాను ఒకమార్గంగా ఉపయోగించుకుంటోంది పాకిస్థాన్. చాపకింద నీరులా గుట్టుచప్పుడు అణువిద్యుత్ ప్లాంట్లను నిర్మించేందుకు చైనా పాకిస్తాన్‌కు సహాయం చేసింది.

న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ చష్మాలో నాలుగు 300 మెగావాట్ల అణువిద్యుత్ ప్లాంట్‌లను, కరాచీలో రెండు వెయ్యి మెగావాట్ల ప్లాంట్లను చైనా నిర్మించింది. చష్మాలో మరో వెయ్యి మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించేందుకు చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

చైనా నుంచి ఈ సరుకు బయలుదేరడంతో చైనా, పాక్‌ల మధ్య భారీ స్థాయిలోనే అణుకార్యక్రమాల వ్యవహారం లోపాయికారిగా సాగుతోందని మరోసారి స్పష్టమైంది. సిఎన్‌సి మిషిన్ డేంజర్ మిషిన్ అయినందున, ఇది ప్రపంచభద్రతను దెబ్బతీస్తుందని 1996 నుంచి దీనిని వాసెనార్ అగ్రిమెంట్‌లో చేర్చారు. అంతర్జాతీయ ఆయుధాల నియంత్రణలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది.

కొన్ని దేశాలు రహస్యంగా అణ్వాయుధ కార్యక్రమాలను చేపడుతుండటంతో.. ఈ మిషన్ కావడంతో ప్రజలు, సైనకులు వాడటాన్ని నిషేధించారు. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన 42 దేశాలలో ఇండియా కూడా ఉంది. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న సీఎన్సీ మిషన్.. ఈ ఒప్పందం పరిధిలోకి వస్తుంది.

పటిష్ఠ బందోబస్తు
ముంబైలో ఆపిన నౌకనే కాదు.. తీరం వెంబడి శత్రువేట కొనసాగిస్తూనే ఉంది నేవీ. కవ్వింపు చర్యలను కట్టడిచేయడంతో పాటు శత్రువులను కనిపెట్టేందుకు నిఘాపెంచాయి భారత భద్రతా బలగాలు. ముఖ్యంగా అరేబియా సముద్రంలో నేవీ పటిష్ఠ బందోబస్తు చర్యలు తీసుకుంటోంది. పాకిస్థాన్ నుంచి భారత్ లోకి వస్తోన్న డ్రగ్స్, ఉగ్రమూకలను అరికడుతున్నాయి.

ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం పాకిస్థాన్ నుంచి వచ్చిన దాదాపు 22వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ నేవీ, కస్టమ్స్ జాయింట్ ఆపరేషన్ లో సీజ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా చైనా టు పాక్ వయా ముంబై నుంచి వెళ్తున్న నౌక కస్టమ్స్ అధికారుల కంట పడింది. అనుమానం వచ్చి తనిఖీ చేసి సరుకును సీజ్ చేశారు.

Also Read: ఆరోజే నాకు క్యాన్సర్ ఉందని తెలిసింది.. ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ వెల్లడి!

ట్రెండింగ్ వార్తలు