నాయకుడి కోసం : శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల మీటింగ్

బల పరీక్షలో నిరూపించుకోవాలంటూ సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా ప్రకటించారు. బలపరీక్షకు ముందే అకస్మాత్తుగా రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే జత కట్టి ఉన్న కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీలు 5గంటలకు సమావేశం కానున్నాయి. కూటమిలో తమ నాయకుడెవరో ప్రతిపాదించడమే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశ్యం. 

శనివారం తెల్లవారుజామున తీసుకున్న నిర్ణయాలపై ఎన్సీపీ సహా కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బలపరీక్షలో ఎమ్మెల్యే బలబలాలను నిరూపించుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

మరోవైపు సీఎంగా ఫడ్నవీస్ మంగళవారం మధ్యాహ్నాం 3.30 గంటలకు మీడియా సమావేశంలో అజిత్ పవార్ రాజీనామాకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చి రాత్రికి రాత్రే బీజేపీ జతకట్టిన అజిత్.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.