ప్రశ్నించడం పాపమా : మహిళ చున్నీ లాగిన మాజీ సీఎం సిద్దూ

  • Publish Date - January 28, 2019 / 11:00 AM IST

ఆయన ఓ సీనియర్ నేత. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. పైగా మాజీ ముఖ్యమంత్రి. అలాంటి నాయకుడు ఎంత హుందాగా ప్రవర్తించాలి. మరీ ముఖ్యంగా మహిళల పట్ల. స్త్రీలకు మర్యాద, గౌరవం ఇవ్వాలి. కానీ కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య మాత్రం లిమిట్స్ క్రాస్ చేశారు. మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమె చున్నీ లాగేసి దురుసుగా బిహేవ్ చేశారు.

 

వివరాల్లోకి వెళితే.. వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానికులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. దీనికి సిద్ధరామయ్య హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ మహిళ సమస్యలపై సిద్ధూని నిలదీసింది.  దీంతో సిద్ధరామయ్యకి కోపం వచ్చింది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ముందెళ్లి కూర్చోవమ్మా అంటూ ఆమెపై కేకలు వేశారు. అంతటితో ఊరుకోక ఆమె చేతిలో ఉన్న మైక్‌ని లాక్కున్నారు. దాంతో పాటే ఆమె చున్నీ కూడా వచ్చేసింది.

 

సిద్ధరామయ్య ప్రవర్తనతో ఆ మహిళతో పాటు అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. సిద్ధూ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మహిళలతో వ్యవహరించే తీరు ఇదేనా అని మండిపడుతున్నారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఫైర్ అవుతున్నారు.