×
Ad

Video: నిద్రలో పదో అంతస్తు నుంచి పడిపోయిన వ్యక్తి.. కాలు 8వ అంతస్తు గ్రిల్‌లో ఇరుక్కుపోవడంతో..

గంటపాటు అక్కడివారందరూ కంగారు పడిపోయారు.

Video: నిద్రలో పక్కకు జరిగిన ఓ వ్యక్తి పదో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. అతడి కాలు 8వ అంతస్తు గ్రిల్‌లో ఇరుక్కుపోవడంతో బతికిపోయాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జహంగీరపురా ప్రాంతంలోని టైమ్స్ గెలాక్సీ భవనంలో చోటుచేసుకుంది.

బుధవారం ఉదయం 8 గంటల సమయంలో నితిన్‌భాయ్ ఆదియా (57) తన ఇంట్లో కిటికీ దగ్గర నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో అతడు పక్కకు తిరగడంతో కిటికీ నుంచి నేరుగా కిందకు పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతడి ఫ్లాట్‌కు రెండు అంతస్తుల కింద ఉన్న ఫ్లాట్‌ గ్రిల్‌లో అతని కాలు ఇరుక్కుపోయింది. ఆ తరువాత గంటపాటు అక్కడివారందరూ కంగారు పడిపోయారు.

అక్కడివారు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. జహంగీరపురా, పలన్‌పూర్, అదాజన్ ఫైర్ స్టేషన్ల నుంచి సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. పై అంతస్తు నుంచి తాళ్లు, సేఫ్టీ బెల్ట్ ఉపయోగించి అతడిని పైకి లాగేందుకు ప్రయత్నించాయి. చివరకు అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో పనిచేసి అతడిని సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆదియా ఈ వీడియోలో తలకిందులుగా వేలాడుతూ కనిపించాడు. అతని కాలు గ్రిల్ బాక్స్‌లో పైభాగం నుంచి బిగుసుకుపోయినట్లు చూడొచ్చు. ప్రస్తుతం ఆదియాకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.