కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సెటైర్లు విసిరారు. సోనియా గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని, సొంత మనుషులను పురమాయించి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎదురుప్రశ్నిస్తూ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఢిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను తీహార్ జైలుకు పంపిన సంగతి గుర్తు చేశారు.
‘శ్రీమతి సోనియా గాంధీ మానవ హక్కులు కేవలం హిందూ బెంగాలీలపైనే పనిచేస్తున్నాయా. కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఏం చేశారో అంతా తెలుసు. సోనియా గాంధీది మొసలి కన్నీరు. సోనియా ప్రతిపక్ష హోదాలో ఉండి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. శాంతి, ప్రశాంతతను ప్రోత్సహించాల్సింది పోయి హింసను ప్రేరేపిస్తున్నారు’ అని సెటైర్ విసిరారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో శనివారం, డిసెంబర్ 14న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ బచావో ర్యాలీలో సోనియా మాట్లాడుతూ..తమకు కావాల్సిన చోట రాజ్యాంగ అధికరణలను విధిస్తూ, అధికరణలను రద్దు చేస్తూ రాష్ట్రాల హోదాలను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆమె అన్నారు. మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని.. యువతకు ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయిందని విమర్శించారు. ‘సబ్ సాత్, సబ్ కా వికాస్’ హామీ ఏమైందని సోనియా గాంధీ ప్రశ్నించారు.