వ్యవసాయ చట్టాలపై విరుగుడు మార్గాలను అన్వేషించండి…కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సోనియా విజ్ఞప్తి

sonia-gandhi

మోడీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను తిరస్కరించే మార్గాలను అన్వేషించమంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఓ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 254(2) కింద బిల్లులను పాస్ చేసే మార్గాలను అన్వేషించాల్సిందిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను సోనియా గాంధీ కోరారు. ఆర్టికల్ 254(2) కింద కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు అనంతరం రాష్ట్రపతి దగ్గరకు వస్తుందని ఆయన ఆ ట్వీట్‌లో తెలిపారు.


వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ ఒకవేళ ఏ రాష్ట్రమైనా స్వంతంగా బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఆ రాష్ట్రంలో అమలుకాదు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ మార్గాలనే అన్వేషిస్తోంది.

ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఒకవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపినప్పటికీ ఈ బిల్లుల ఆమోదానికే ఆయన మొగ్గు చూపారు. ఒకవైపు రైతులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపినప్పటికీ ఈ బిల్లుల ఆమోదానికే ఆయన మొగ్గు చూపారు.దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభలు ఆమోదించిన నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ బిల్లు-2020 ఇక చట్టంగా మారిపోయాయి.


మరోవైపు, దేశ వ్యాప్తంగా రైతులు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా,పంజాబ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు పెద్దఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. కాగా, వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంలో భాగమైన శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఇప్పటికే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.