కాంగ్రెస్ కు షాక్ : బీజేపీలోకి సోనియా ముఖ్య అనుచరుడు

లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సోనియాగాంధీకి ప్రధాన అనుచరుడిగా ఉన్న టామ్ వడక్కన్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. గురువారం(మార్చి-14,2019) టామ్ బీజేపీలో చేరారు.బీజేపీ సీనియర్ నాయకుడు,కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కాషాయ కండువా కప్పి టామ్ ని పార్టీలోకి ఆహ్వానించారు.
Read Also : మండలి ఎన్నికల లీవు : అందరికీ కాదు..వారికే

ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ని టామ్ కలిశారు.పుల్వామా ఉగ్రదాడి, భాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ పై ఈ సందర్భంగా  టామ్ విమర్శలు గుప్పించారు. మెరుపుదాడుల విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు చాలా భాధాకరమన్నారు. దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అలాంటి స్టాండ్ తీసుకున్నప్పుడు తాను కాంగ్రెస్ పార్టీని వీడటం తప్ప వేరే మార్గం లేదని తెలిపారు.కాంగ్రెస్ లో యూజ్ అండ్ త్రో పాలసీ ఉందని ఆరోపించారు.

ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు.చాలా ఏళ్లుగా సోనియాకు టామ్ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ భాధ్యతలు చేపట్టిన సమయంలో ఏర్పాటు చేసిన మొదటి మీడియా కమిటీలో సభ్యుడిగా టామ్ పనిచేశారు. కేరళలోని త్రిసూర్ లేదా ఎర్నాకులం నియోజకవర్గం నుంచి మరికొన్ని రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయాలని టామ్ భావిస్తున్నారు.