Southwest Monsoon: ఒక రోజు ముందుగానే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

భారత వాతావరణ శాఖ అంచనా వేసిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే కేరళను తాకాయి నైరుతి రుతుపవనాలు.

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని, ఈశాన్య ప్రాంతాలను తాకాయి. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తారు. రానున్న 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. 5 రోజుల పాటు కేరళకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ.

భారత వాతావరణ శాఖ అంచనా వేసిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే కేరళను తాకాయి నైరుతి రుతుపవనాలు. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది.

కాగా, నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1-4 తేదీల మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ సారి ముందుగానే తాకాయి. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించకముందే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండడం గమనార్హం. కేరళలోకి ప్రవేశించాక నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదులుతాయి.

Also Read: ఈ వీడియోలో ఉన్న వ్యక్తిది ఏం వెర్రో మీరే చెప్పండి: వీసీ సజ్జనార్