Special Focus On Khalistani Issue Why did they target Hindu temples
Khalistani Issue : ఖలిస్తానీలు భారత్‌కి పక్కలో బల్లెంలా తయారవుతున్నారా. పూటకో వార్నింగ్ ఇస్తూ మాటలతో మంటలు పెడుతున్నారా.. ఖలిస్తానీలు ఎందుకు మళ్లీ రీసౌండ్ చేస్తున్నారు. భారత్ శత్రు దేశాలకు ఖలీస్థానీలకు ఉన్న లింక్ ఏంటి? ఖలీస్తానీలకు కెనడా ఎందుకు సపోర్ట్ చేస్తోంది. ఇంతకీ ఖలీస్తానీలు హిందూ ఆలయాలనే ఎందుకు టార్గెట్ చేశారు. అసలు వారిని రెచ్చగెట్టెదెవరు.. రచ్చలేపేదెవరు?
భారత్‌కు ఖలిస్తానీ వేర్పాటువాదులు మళ్లీ ముప్పుగా తయారయ్యారు. వరుసగా వార్నింగ్‌లు ఇస్తూ దేశాన్ని టెన్షన్ పెడుతున్నారు. గుడులను కూల్చేస్తామని, విమానాలను పేల్చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు భారత్‌లోని హిందూ ఆలయాలను కూల్చేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఏకంగా అయోధ్య రామ మందిరాన్ని పునాదులతో సహా పెకిలిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో తామెంటో చూపిస్తామని ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. హిందూ దేవాలయాలపై ఖలిస్థానీలు చేస్తున్న దాడులకు దూరంగా ఉండాలని కెనడాలోని భారతీయులను గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ బెదిరించాడు.
పిరికిపంద చర్య..
ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపుతో కెనడాలోని హిందూ దేవాలయంలో నవంబర్ 17న జరగాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఖలిస్తానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్ కాన్సులేట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇదే ఆలయంపై నవంబర్ 3న ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఈ ఘటనపై యావత్ భారత ప్రజలు మండిపడ్డారు. పిరికిపంద చర్య అంటూ ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. దాడి చేసిన వారిని కెనడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయి.
Gold : రానున్న రోజుల్లో మరింతగా తగ్గునున్న బంగారం ధర..! ట్రంప్ విక్టరీ పుణ్యమేనా..?
కెనడా -భారత్ మధ్య ఎప్పటి నుంచో పొసగడం లేదు. బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వార్ వెలుపల ఖలిస్తానీ వేర్పాటువాది హరదీప్ సింగ్ నిజ్జర్ గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. అయితే, ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్రపై ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేశారు. ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య యుద్దానికి తెరలేపాయి. భారత్‌ను దెబ్బతీసేందుకు ఖలీస్తానీలకు అండగా ఉంటుంది అక్కడి కెనడా ప్రభుత్వం. మరోవైపు తమ దేశంలో భారీ సంఖ్యలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఉన్నారని గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా అంగీకరించారు. ఆ సమయంలో ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అలాగే ఖలీస్తానీ ఉగ్రవాది, హర్దీప్ సింగ్ నిజ్జర్ ముఖ్య అనుచురుడు అర్షదీప్ దల్లాను కెనడాలోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వదిలిపెట్టారా? లేదా జైల్లో ఉన్నాడా? అనేది ఇప్పటికి రహస్యంగా ఉంది.
ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో అర్థంకాని పరిస్థితి..
మరోవైపు ఖలిస్తానీ నాయకులు.. పాకిస్తానీ గ్రూపులను కలిశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. పాకిస్తానీ ఉగ్రవాదులు.. ఖలిస్తానీలతో కలిసి భారత్‌లో విధ్వంసానికి పాల్పడతారనే ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. ఇలా ఖలిస్తానీలు భారత్‌కు కంటిలో నలుసులా తయారయ్యారు. ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో అర్థంకాని పరిస్థితి వచ్చింది.
అయితే ఖలీస్తానీల బెదిరింపులు కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సమయంలో కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆ సమయంలో పోలీసులు అలర్ట్ అయి.. ఖలీస్తానీల కదలికలపై కన్నేసి ఉంచారు. ఇప్పుడు మళ్లీ అయోధ్య పేరును ప్రస్తావించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు కొద్ది రోజుల క్రితమే పన్నూ నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిరిండియా విమానాల్లో సిక్కులు ఎవరు ప్రయాణించొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు జరిగిన సందర్భంగా ఎయిరిండియా విమానాలపై దాడులు చేస్తామంటూ పన్నూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును మూసివేస్తారని.. భవిష్యత్తులో ఆ ఎయిర్‌పోర్టు పేరు కూడా మారుతుందని పన్నూ చెప్పుకొచ్చాడు. ఇలా పన్నూ పూటకో వార్నింగ్ ఇస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నాడు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక పదవులు
పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఖలీస్తానీ ఉద్యమం కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం ఉదృతంగా సాగిన ఈ ఉద్యమం భింద్రన్‌వాలా మరణం తర్వాత కూల్ అయింది. ఖలిస్థాన్ ఉద్యమం పేరుతో భారీ హింస సాగింది. ఈ ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. బాడీగార్డుల చేతుల్లోనే హత్యకు గురయ్యారు. ఐతే ఆ తర్వాత ఈ ఉద్యమం గురించి అక్కడో ఇక్కడో చిన్నగా వినిపించడమే తప్ప.. పెద్దగా చర్చ జరగలేదు. ఐతే కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. మళ్లీ ఇప్పుడు పన్నూ చర్యలతో వేర్పాటువాదం పదునెక్కింది. ఇలా ఒక చర్యతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.