Sputnik Light vaccine : సెప్టెంబర్ లో అందుబాటులోకి సింగిల్ డోస్ వ్యాక్సిన్

రష్యాకు చెందిన సింగిల్‌ డోస్‌ కరోనా టీకా స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది.

Sputnik Light Vaccine

Sputnik Light vaccine : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికి 56 కోట్ల డోస్ ల టీకాలను పంపిణి చేశారు. ప్రస్తుతం రెండు డబుల్ డోస్ టీకాలను ఇస్తున్నారు. అయితే త్వరలో దేశంలోకి సింగిల్ డోస్ కరోనా టీకా ఇవ్వనున్నారు. రష్యాకు చెందిన సింగిల్‌ డోస్‌ కరోనా టీకా స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి అవుతుందని నిపుణు అభిప్రాయపడుతున్నారు.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (RDIF)తో ఒప్పందం చేసుకున్న పనాసియా బయోటెక్‌ స్పుత్నిక్‌ లైట్‌ అత్యవసర వినియోగం కోసం డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కోరింది. వ్యాక్సిన్‌ ధర రూ.750 ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ను మాస్కోలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ రష్యన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ పరాగ్వేలో 93.5 శాతం సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆర్‌డీఐఎఫ్‌ బుధవారం తెలిపింది. రష్యాలో మే నెలలో అత్యవసర వినియోగ అధికారం పొందిన సమయంలో 79.4 శాతం సామర్ధ్యాన్ని చూపించిందని ఆర్‌డీఐఎఫ్‌ హెడ్‌ కిరిల్‌ డిమిత్రివ్‌ పేర్కొన్నారు. మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ సైతం స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ 91.6శాతం ప్రభావంతంగా ఉన్నట్లు తెలిపింది.

స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ 10 దేశాల్లో జరిగాయి. వీటిలో రష్యా, యూఏఈ, ఘానా దేశాలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ కొన్ని వేరియంట్లపై ప్రభావితంగా పనిచేస్తుందని గమలేయా సెంటర్‌ తెలిపింది. ఈ టీకాపై ప్రముఖ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ గగన్‌ దీప్‌ కాంగ్‌ మాట్లాడుతూ సమర్థవంతమైన డేటాతో వ్యాక్సిన్‌ను ఆమోదిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు. సింగిల్ డోస్ కావడంతో టీకా త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.