భాతర బొగ్గు కనుల్లో విదేశీ పెట్టుపడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి.
ప్రభుత్వరంగ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. భాతర బొగ్గు కనుల్లో విదేశీ పెట్టుపడులను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఒక్క రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. కోల్ ఇండియాలో 100 శాతం విదేశీ పెట్టుబడులను నిరసిస్తూ కార్మికులు సమ్మె చేపట్టారు. జాతీయ కార్మిక సంఘాలు ఒకరోజు టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెతో బెల్లంపల్లి రీజియన్ లో ఒక్కరోజుకు రూ.18 కోట్ల నష్టం జరుగనుంది.
ఇదే అంశంపై బీఎంఎస్ జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 23 నుంచి 29వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే బీఎంఎస్ సమ్మె పట్ల సింగరేణిలో అంత స్పందన కనిపించలేదు. సోమవారం బీంఎఎస్ సమ్మెలో కార్మికవర్గం పాల్గొనలేదు. అయితే సెప్టెంబర్ 24న తలపెట్టిన టోకెన్ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీ యూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ సింగరేణిలో సమ్మెను విజయవంతం చేసేందుకు ముమ్మర ప్రచారం చేశాయి. దీంతో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో బొగ్గు పరిశ్రమల్లో తలపెట్టిన సమ్మె సింగరేణిలో జరిగే అవకాశం ఏర్పడింది.
సమ్మెకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) కూడా మద్దతు తెలిపింది. ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూలు సైతం సమ్మెను బలపరుస్తూ సింగరేణిలో ప్రచారం కూడా జరిపాయి. దీంతో ప్రభుత్వరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టమైంది. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించడంతో పాటు కోల్ ఇండియాలోని బొగ్గు పరిశ్రమలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని కూడా జాతీయ కార్మిక సంఘాలు ప్రధాన డిమాండ్‌గా టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఒకేరోజు సమ్మె కావడంతో పాటు సింగరేణిలోని అన్నీ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో కార్మికవర్గం కూడా సమ్మెకు సంసిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది.
అయితే యాజమాన్యం ఇది సింగరేణి కార్మికుల డిమాండ్లకు సంబంధించిన అంశం కాదని, సమ్మె చేయడం వల్ల కార్మికు లు రూ.20కోట్ల వేతనాలు నష్టపోయే అవకాశం ఉందని చెబుతోంది. సమ్మెకు కార్మికవర్గం దూరంగా ఉండాలని కోరింది. సమ్మె జరిగితే 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడనుంది. ఒక్క రోజు సమ్మెతో రూ.53 కోట్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగనుంది. సమ్మె సందర్భంగా పోలీస్ యంత్రాంగం కోల్‌బెల్ట్ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. చాలా కాలంగా సింగరేణిలో సమ్మెలు లేని క్రమంలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు గట్టి ప్రయత్నం చేశాయి. బొగ్గు బావులు, ఓపెన్‌కాస్టు, విభాగాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించాయి.