Udhayanidhi Stalin : నటి త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
Udhayanidhi Stalin : తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే నేత ఉదయ్ నిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
DMK leader Udhayanidhi Stalin arrest
Udhayanidhi Stalin : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. డీఎంకే పార్టీ కార్యక్రమంలో సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై తంజావూరులోని పోలీస్ స్టేషన్లో ఆరు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీంతో ఉదయాన్నే పోలీసులు ఉదయనిధి నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇదే సమయంలో డీఎంకే నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఉదయనిధిని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి తరలిస్తుండగా పోలీసు వాహనాలను డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎంకే కార్యకర్తలు పెద్దెత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, డీఎంకే కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోవటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డీఎంకే కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి ఉదయనిధిని అక్కడి నుంచి తరలించారు.
పోలీసుల అరెస్టు అనంతరం ఉదయనిధి మాట్లాడుతూ.. న్యాయపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. ఎవరి పేరును నేనే ప్రస్తావించలేదు. ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటా అని అన్నారు. మరోవైపు.. ఉదయనిధి తన వ్యాఖ్యలకు వెనక్కు తీసుకొని త్రిష, విజయ్‌లకు క్షమాపణలు చెప్పాలని టీవీకే నేతలు నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టు విచారణ జరపనుంది.
ఇంతకీ విజయ్, త్రిషల గురించి ఏమన్నారంటే?
సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంకు ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. ఉదయనిధి మాట్లాడుతున్న సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉదయనిధి నవ్వుతూ.. ‘కావేరి సమస్యపై సీఎం విజయ్ నోరు విప్పట్లేదు. నీరు ఎక్కడికీ చేరకపోయినా అక్కడికి మాత్రం చేరాలి. నేను అన్నది కావేరీ నీళ్ల గురించే’ అని వ్యాఖ్యానించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే సభలో నటి త్రిష, విజయ్ లను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్ వాడారంటూ టీవీకే మండిపడింది. ఆయనపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కొందరు టీవీకే కార్యకర్తలు విజయ్ పై ఫిర్యాదులు చేయడంతో పోలీసులు మంగళవారం ఆయన్ను తన నివాసంలో అరెస్టు చేశారు. అయితే, కేవలం విచారణ కోసమే తీసుకెళ్తున్నట్లు పలువురు పోలీసులు పేర్కొనడం గమనార్హం.
