ఇది నిజం : 5 పైసలకే చికెన్ బిర్యానీ

టైటిల్ చూసి కంగుతిన్నారా? జోక్ చేయకండి అంటారా? రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో.. 5 పైసలకు బిర్యానీ అంటే నమ్ముతామా అని సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం.

  • Publish Date - October 17, 2019 / 04:35 AM IST

టైటిల్ చూసి కంగుతిన్నారా? జోక్ చేయకండి అంటారా? రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో.. 5 పైసలకు బిర్యానీ అంటే నమ్ముతామా అని సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం.

టైటిల్ చూసి కంగుతిన్నారా? జోక్ చేయకండి అంటారా? రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో.. 5 పైసలకు చికెన్ బిర్యానీ అంటే నమ్ముతామా అని సందేహం రావొచ్చు. అసలు 5 పైసలు చలామణిలో లేదు.. పైగా కనిపించడం కూడా లేదు.. అలాంటిది 5 పైసలకు బిర్యానీ అంటే ఎలా నమ్ముతాం అని అంటారా? కానీ ఇది నిజం. ఆ ఊరిలో 5 పైసలకే ప్లేట్ బిర్యానీ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ లో ఈ ఘటన జరిగింది. దిండిగల్ బస్టాండ్ సమీపంలో ఉన్న ముజిబ్ బిర్యానీ సెంటర్ లో 5పైసలకే బిర్యానీని కస్టమర్లకు ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక కండీషన్ ఉంది.

క్యూలో నిల్చున్న మొదటి 100 మందికి మాత్రమే ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు. దీని గురించి షాపు ఓనర్ రెండు రోజుల ముందే ప్రకటించారు. అంతే ఒక్కసారిగా వైరల్ అయ్యింది. జనాలు ఉదయం నుంచే దుకాణం దగ్గర 5 పైసలతో గుమిగూడారు. వారి దగ్గర 5పైసల కాయిన్ తీసుకోవడంతో పాటు.. వారి పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకొని బిర్యానీ ఇచ్చారు.

5 పైసలకే బిర్యానీ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే. అలాగే పురాతన వస్తువులు, నాణేల పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం ఇలా చేశానని ముజీబ్ బిర్యానీ షాపు ఓనర్ షేక్ ముజిబుర్ రెహ్మాన్ తెలిపారు. కీళడిలో 2వేల 300 ఏళ్లకు ముందు జీవించిన ప్రజలు ఉపయోగించిన వస్తువులు, నాణేలు ఇటీవలే ఆయన చూశారు. పురాతన వస్తువులు, నాణేల పరిరక్షణ ఎంత ముఖ్యమో గుర్తించారు. వాటిపై రానున్న తరానికి అవగాహన కల్పించేందుకు 5పైసలు తీసుకుని బిర్యానీ ఇచ్చినట్లు షాప్ యజమాని రెహ్మాన్ చెప్పారు. మనం ఉపయోగించిన వస్తువులు, నాణేలు భవిష్యత్ తరాలకు తెలపడానికి జాగ్రత్తగా ఉంచడం చాలా ముఖ్యం అని గ్రహించాను..  అలాగే 5 పైసల నాణేలు ఎంతమంది దగ్గర ఉన్నాయో తెలుసుకోవడానికి ఇలా చేశాను అని రెహ్మాన్ వివరించారు. బిర్యానీ ఇచ్చి 5 పైసల నాణేలు సేకరించాను అని చెప్పారు.

కారణం ఏదైతేనేం.. 5 పైసలకే చికెన్ బిర్యానీ ఆఫర్ భలేగుందని స్థానికులు అంటున్నారు. బంపర్ ఆఫర్, భలే మంచి చౌక బేరం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆఫర్లు మళ్లీ మళ్లీ పెడితే బాగుండు అని అంటున్నారు.

కొంతమంది కస్టమర్లు 5 పైసల నాణేలు చాలానే తెచ్చారు. కానీ, మనిషికి ఒక్క బిర్యానీ ప్యాకెట్ మాత్రమే ఇచ్చారు. ముజీబ్ 8 ఏళ్లుగా బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఇలాంటి ఆఫర్ ఇచ్చారు. ఒక్కో ప్యాక్ లో 600 గ్రాముల చికెన్ బిర్యానీ ఉంది. సాధారణంగా ముజీబ్ బిర్యానీ షాపులో బిర్యానీ ప్లేట్ ధర రూ.90. బిర్యానీ కోసం వచ్చిన వారిందరిని… కీళడి వెళ్లారా, పురాతన వస్తువులు చూశారా అని రెహ్మాన్ అడిగారు. ఒకవేళ చూడకపోతే… వెంటనే వెళ్లి పురాతన వస్తువులు, నాణాలను చూసి రావాలని కోరారు.