ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన కీలక సమాచారంతో గుజరాత్‌లో వణుకు మొదలైంది. గుజరాత్ సర్ క్రీక్ తీర ప్రాంతంలోకి ఉగ్రవాదులు బోట్ల సహాయంతో చొరబడినట్లుగా గుర్తించారు. దక్షిణ భారతదేశంలో ప్రమాదాలు ఉన్నాయని తీర ప్రాంత ఇంటిలిజెన్స్ వర్గాలు సూచించడంతో స్థానిక పోలీసులు అలర్ట్ అయ్యారు. కొద్ది రోజుల ముందే సముద్ర తీరాల గుండా ట్రైన్డ్ టెర్రరిస్టులు భారత్ లోకి చొరబడ్డారనే వార్తలు వచ్చిన సమయంలోనే మరోసారి గుజరాత్ తీర ప్రాంతంలోకి ఉగ్రవాదులు చొరబడడం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంది.
భారత దక్షిణ ప్రాంత కమాండింగ్ జనరల్ ఆఫీసర్ ఎస్కే సైనీ తెలిపిన వివరాల ప్రకారం.. ‘దక్షిణ భారతంలో ఉగ్రవాద దాడి సూచనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్ క్రీక్ ప్రాంతంలోకి బోట్ల ద్వారా ప్రవేశించినట్లు సమాచారం. సర్ క్రీక్ ప్రాంత బిల్డింగ్ సామర్థ్యం, ఎదుర్కోగల దారుడ్యాలను అంచనా వేసుకుని సన్నద్దమవ్వాలని’ సూచించారు.
ఆఫీసర్లు హెచ్చరికలు జారీ చేసిన అనంతరం కేరళలోని ఆర్మీ అధికారులు అలర్ట్ చేశారు. తీర ప్రాంతంలో ప్రత్యేకమైన భద్రతలు తీసుకోవాలని సూచించారు. గుంపులుగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ వంటి ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబిర్ సింగ్ పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ గ్రూప్ మరోసారి దాడి చేయడానికి చూస్తున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రత్యేక హోదాను తొలగించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఆందోళన వాతావరణం పెరిగిపోయింది. కొద్ది రోజులుగా భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.