ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో : గుర్రం ఎక్కాడని దళిత ఆర్మీ జవాన్ పెళ్లి కొడుకుపై రాళ్ల దాడి

యుగాలు మారినా మనుషుల్లో ఇంకా మార్పు లేదు. ఇంకా కులం, మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల ఆగడాలు

  • Publish Date - February 18, 2020 / 03:30 AM IST

యుగాలు మారినా మనుషుల్లో ఇంకా మార్పు లేదు. ఇంకా కులం, మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల ఆగడాలు

యుగాలు మారినా మనుషుల్లో ఇంకా మార్పు లేదు. ఇంకా కులం, మతం అని పట్టుకుని వేలాడుతున్నారు. కుల వివక్ష చూపిస్తున్నారు. దళితులపై అగ్రవర్ణాల ఆగడాలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో(gujarat) దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెళ్లి వేడుక సందర్భంగా గుర్రం ఎక్కాడు. అతడు దళితుడు. దళిత వర్గానికి చెందిన యువకుడు గుర్రం ఎక్కడం, ఊరేగింపుగా వెళ్లడం.. అగ్రవర్ణాల వారికి తీవ్రమైన కోపం తెప్పించింది. అంతే.. ఆగ్రహంతో.. పెళ్లి కొడుకుపై రాళ్ల వర్షం(stone pelting) కురిపించారు. ఈ ఘటనలో పెళ్లి కొడుకుతో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత పోలీసుల సెక్యూరిటీ మధ్య వివాహం జరిగింది. 

దళితుడు గుర్రం ఎక్కకూడదు:
పెళ్లి కొడుకు పేరు ఆకాశ్ కుమార్ కొటియా(22)(Akash Kumar Koitiya). భారత ఆర్మీలో జవాన్ గా పని చేస్తున్నాడు. కశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. వివాహం కోసం తన స్వగ్రామం బనస్ కంత(Banaskantha) జిల్లాలోని షరీఫ్ దా(Sharifda) వచ్చాడు. వివాహ వేడుకలో భాగంగా వరుడు గుర్రం ఎక్కాడు. గ్రామంలో గుర్రంపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి వెళ్లాడా. గుర్రం ఎక్కడమే అతడి పాలిట నేరమైంది. అగ్రవర్ణాల వారి ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఠాకూర్ కోలి వర్గానికి చెందిన వారు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు ఉన్నా వారు భయపడలేదు. రాళ్ల వర్షం కురిపించారు. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) ఉదయం 11 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. 

గుర్రం ఎక్కితే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్:
వివాహ వేడుకలో భాగంగా గ్రామంలో ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితి. అయితే దళితుడు కావడంతో గుర్రం ఎక్కడానికి వీల్లేదని ఠాకూర్ సామాజికవర్గానికి(Thakor Koli community) చెందిన వారు ఆదేశించారు. ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వరుడిని బెదిరించారు. దీంతో తనకు రక్షణ కావాలని వరుడు ఆకాశ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఏడుగురు సిబ్బందిని ఇచ్చారు. పోలీసులు ఉన్నా దాడిని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ దాడిపై స్పందించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన 11మందిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దర్యాఫ్తు చేస్తున్నామని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. 

ఆర్మీ జవాన్ కిచ్చే గౌరవం ఇదేనా?
దళితుడు అన్న ఒకే ఒక్క కారణంతో.. అగ్రవర్ణానికి చెందిన వారు ఇలా దాడి చేయడం చర్చకు దారితీసింది. వారి తీరుని అంతా తప్పు పడుతున్నారు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న ఈ రోజుల్లో ఇంకా కుల వివక్ష ఏంటని మండిపడుతున్నారు. ఆకాశ్.. ఆర్మీ జవాన్ అనే విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న యువకుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని నిలదీస్తున్నారు. దళితుడు గుర్రం ఎక్కడం నేరమని ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పాలన్నారు.

కాగా, వివాహంలో భాగంగా దళిత వరుడు గుర్రం ఎక్కితే దాడి జరగడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. దేశవ్యాప్తంగా గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. 2018 ఏప్రిల్ లో రాజస్థాన్ బిల్ వారాలో గుర్రం ఎక్కాడాని వరుడిపై దాడి జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 2017లో హర్యానాలో, 2015లో మధ్యప్రదేశ్ లోని రత్లామ్ ఇలాంటి దాడులు జరిగాయి. 

Read More>>  సింగర్ సూసైడ్ – ఎవ్వరినీ వదలొద్దంటూ విన్నపం