The Red Fort siege was unfortunate says president ramnath kovind : గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జరిగిన హింస పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. గణతంత్ర దినోత్సవం జరిగిన ఘటనలను ఆయన ఖండించారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ వేళ హింస చోటుచేసుకోవడం పట్ల రాష్ట్రపతి ఆవేదన చెందారు. ఎర్రకోట ముట్టడి దురదృష్టకరమన్నారు. శుక్రవారం (జనవరి 29, 2021) పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.
జనవరి 26న జరిగిన ఘటన ఆవేదనకు గురి చేసిందన్నారు. జాతీయ జెండాను, అతి పవిత్రమైన గణతంత్ర దినోత్సవాన్ని అవమానించినట్లు ఆయన చెప్పారు. భావస్వేచ్ఛను కల్పించే రాజ్యాంగమే.. చట్టాలు, ఆంక్షలను పాటించాలని కూడా సూచించినట్లు తెలిపారు. శాంతి భద్రతల్ని ఆషామాషీగా తీసుకోవద్దన్నారు.
రైతు ఉత్పత్తులపై కనీస మద్దతు ధరను తమ ప్రభుత్వం పెంచినట్లు రాష్ట్రపతి వెల్లడించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. 25 కోట్ల ముద్ర రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. దేశ రైతాంగాన్ని బలోపేతం చేసేందుకు ఆత్మనిర్భర్ భారత్ ఫోకస్ చేసినట్లు చెప్పారు. రైతుల మేలు కోసమే కొత్త వ్యవసాయం చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. కొత్త సాగు చట్టాలతో 10 కోట్ల మంది రైతులు లాభపడనున్నట్లు పేర్కొన్నారు..
ఆత్మనిర్భర్ ప్యాకేజ్ క్లిష్ట పరిస్థితుల్లో ఒక వరంగా మారిందన్నారు. ఆయుష్మాన్ భారత్ లో పేదలకు మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. కోటిన్నర మందికి ఉచితంగా వైద్యసాయం అందించామని తెలిపారు. పేదల కోసం వన్ నేషన్-వన్ రేషన్ అమలు చేసినట్లు ప్రకటించారు. జన్ ధన్ యోజనతో నేరుగా అకౌంట్లలోకి నగదు బదిలీ జరిగిందని తెలిపారు.
లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకున్నామని తెలిపారు. రెండు వ్యాక్సిన్లను భారత్ లో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కరోనా ఎందరో మహనీయుల్ని బలి తీసుకుందన్నారు. ప్రణబ్ ముఖర్జీ లాంటి నేతలను కరోనా కారణంగా కోల్పోయామని తెలిపారు. సంక్లిష్ట పరిస్థితుల్లో చాలా ప్రాధాన్యతలతో బడ్జెట్ ప్రవేశపడుతున్నామని చెప్పారు.
సమస్యలు, సవాళ్లను అధిగమించి భారత్ మొందుకెళ్తోందని తెలిపారు. ప్రతి సమస్యను దేశమంతా ఒక్కటిగా ఎదుర్కొంటుందన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏకతాటిపై నిలిచామని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ సమావేశాలు విశిష్టమైనవని తెలిపారు.
కరోనా, బర్డ్ ఫ్లూను భారత్ సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు.
సమస్య ఏదైనా భారత్ ధీటుగా ఎదుర్కొంటుందని చెప్పారు. ఎంత పెద్ద సవాల్ అయినా భారత్ ముందు తలొంచాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకే లక్ష్యం, ఒకే ఆశయం కోసం భారత్ పని చేస్తోందన్నారు. గతేడాది భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొందని గుర్తు చేశారు.