Supreme Court
Supreme Court: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అమలు అంశం తేల్చేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పును పున: పరిశీలనకు కోర్టు ఆమోదం తెలిపింది. ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఉచితాలను అందించే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిటీషనర్ పేర్కొనడంతో కోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల ఈ కేసుపై సీజేఏ జస్టిస్ ఎన్ వి రమణ విచారణ చేశారు. రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి, ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని, అయితే ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు కమిటీ వేయాలనుకుంటున్నట్లు వెల్లడింది.
ఈ క్రమంలో శుక్రవారం మరోసారి ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎన్వీ రమణ ఈ కేసుపై విచారణ జరిపారు. అయితే ఎన్వీ రమణ ఈ రోజు పదవీ విరమణ కానున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారమైంది. విచారణలో భాగంగా ఎన్వీ రమణ పార్టీల ఉచిత హామీల పిటీషన్ పై విచారణ చేస్తూ.. ఉచిత హామీల అమలు అంశం తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ధర్మాసనం ఏర్పాటు చేసింది. అయితే ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి సీజేఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
ఇదిలాఉంటే.. ఇదే కేసులో 2013లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సీజేఐ ఎన్.వి. రమణ పదవీ విరమణ ఈ రోజే కావటంతో కోర్టు చరిత్రలో తొలిసారి ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. రమణ పదవీ విరమణ సందర్భంగా న్యాయవాదులు ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు.