మీరు పాకిస్తానీలా? భారత్ మాతాకి జై అనాల్సిందే: టిక్ టాక్ స్టార్, బీజేపీ అభ్యర్ధి సోనాలి

  • Publish Date - October 8, 2019 / 10:50 AM IST

టిక్ టాక్ లు చేసి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ సోనాలి ఫోగాట్. టిక్ టాక్ లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమెకు హర్యానా రాష్ట్రంలో ఆడంపూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చింది బీజేపీ. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న స్టార్ సోనాలి ఫోగాట్ తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.

ఆమె ఏ మాటలు మాట్లాడినా కూడా అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా హర్యానాలో ప్రచారం నిర్వహిస్తున్న సోనాలి ఫోగాట్  “భారత్ మాతా కి జై” అని చెప్పలేని వారి ఓట్లకు విలువ లేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ “భారత్ మాతాకి జై” అనే నినాదం చేశారు ఫోగాట్. ఆ నినాదాన్ని గట్టిగా పలకలేనప్పుడు సిగ్గుపడాలి అని ఆమె అన్నారు. అంతేకాదు అక్కడ గట్టిగా నినాదాన్ని పలకనివారిని ఉద్ధేశిస్తూ..”మీరంతా పాకిస్తాన్ నుండి వచ్చారా? మీరు పాకిస్తానీలా? కాదు కదా? మీరు భారతీయులైతే భారత్ మాతా కి జై అని చెప్పండి” అంటూ ఆమె అన్నది.

కొంతమంది అప్పటికి కూడా నినాదం పలకకపోవడంతో “భారత్ మాతాకి జై అని పలకలేనివాళ్లు సిగ్గు పడాలని, రాజకీయాల కోసం భారత్ మాతాకి జై అని చెప్పలేని వారి ఓట్లకు విలువ లేదు” అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక అక్టోబర్ 21వ తేదీన హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయిపై ఆమె ఆడంపూర్‌లో పోటీ చేస్తున్నారు. బిష్ణోయ్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు. మనోహల్ లాల్ ఖత్తర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హర్యానాలో మరోసారి అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతుంది. రాష్ట్ర అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా 75 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది.