×
Ad

కదులుతున్న కారులో 2 గంటల పాటు యువతిపై దారుణం.. 90 కి.మీ వేగంతో వెళ్తూ చివరకు బయటకు తోసేసి..

హరియాణాలోని ఫరీదాబాద్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లి, రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తున్న సమయంలో ఆమెకు నిందితులు లిఫ్ట్ ఇచ్చి దారుణానికి పాల్పడ్డారు.

Representative Image

  • హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఘటన
  • వివాహితపై కదులుతున్న కారులో అత్యాచారం 
  • ముఖం, తలపై తీవ్ర గాయాలు, 12 కుట్లు
  • యువతి పరిస్థితి విషమం 

Faridabad Woman: హరియాణాలోని ఫరీదాబాద్‌లో అతి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత(25)ను కదులుతున్న కారులో తిప్పుతూ అత్యాచారం చేశారు. ఆ తర్వాత వాహనం నుంచి ఆమెను బయటకు తోసేయడంతో ముఖం, తలకు తీవ్ర గాయాలయ్యాయి.

దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి పలు వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి నిందితులు ఆమెను కారులో తీసుకెళ్తూ తెల్లవారుజామున 3 గంటలకు రాజా చౌక్ సమీపంలో.. గంటకు 90 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్న వాహనం నుంచి బయటకు తోసేశారు.

ముఖం, తలపై తీవ్ర గాయాలు కావడంతో 12 కుట్లు పడ్డాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేదు.

లిఫ్ట్ ఇచ్చి, అత్యాచారం చేసి..
బాధిత మహిళ సోదరి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. వైవాహిక విభేదాల కారణంగా బాధితురాలు తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది. సోమవారం సాయంత్రం సెక్టార్ 23లో స్నేహితురాలి ఇంటికి వెళ్లి, రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తున్న సమయంలో నిందితులు లిఫ్ట్ ఇచ్చారు.

Also Read: Video: లేడీ బాస్‌ డేంజరా ఏంటి? మహిళా మేనేజర్‌ వద్దు, పురుష మేనేజరే కావాలి.. లేడీస్‌ ధోరణి కూడా ఇదే

ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లకుండా నిందితులిద్దరూ గురుగ్రామ్ వైపు కారును మళ్లించి వాహనం లోపలే అత్యాచారం చేశారు. బాధితురాలు తన సోదరికి ఫోన్ చేయగలిగింది, ఆమె అక్కడికి వచ్చి బాద్‌షా ఖాన్ సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది.

గాయాల తీవ్రత దృష్ట్యా ఢిల్లీకి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు ఫరీదాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమెను చేర్పించారు. “వాహనం నుంచి బయటకు తోసిన తర్వాత నా సోదరి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితిని చూసి ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించాలని నిర్ణయించాం” అని బాధితురాలి సోదరి తెలిపారు.

నిందితులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు. ప్రస్తుతం ఫరీదాబాద్‌లో నివసిస్తున్నారు. బాధిత మహిళకు వారితో ఇంతకుముందు ఎన్నడూ పరిచయం లేదు. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ పూర్తయిన తర్వాత వారి గుర్తింపును వెల్లడిస్తామని చెప్పారు.

“మేము నిందితులను అదుపులోకి తీసుకున్నాం, విచారణ కొనసాగుతోంది. వారిని కోర్టులో హాజరుపరుస్తాం. టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ ఇంకా జరగలేదు కాబట్టి పేర్లు, ఫొటోలు ప్రస్తుతం వెల్లడించలేం” అని ఫరీదాబాద్ పోలీసు ప్రతినిధి యశ్‌పాల్ యాదవ్ తెలిపారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు.