TMC MLA Jayanta Naskar : కోవిడ్ నెగిటివ్ వచ్చినా..టీఎంసీ ఎమ్మెల్యే కన్నుమూత

తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌(73) కరోనా వైరస్‌కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు.

TMC MLA Jayanta Naskar తృణముల్ కాంగ్రెస్ పార్టీ(TMC)ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌(73) కరోనా వైరస్‌కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గోసాబా స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన జయంత్‌ నాస్కర్‌.. కోల్‌కతాలోని ఓ హాస్పిటల్ లో శనివారం రాత్రి 8:20గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

జయంత్ నాస్కర్ గత నెల రోజులుగా కరోనా వైరస్‌ సోకి బాధపడుతున్నారు. మే-19న ఆయనకి కరోనా సోకినట్లు తేలింది. నాస్కర్‌ ఇతర శారీరక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జయంత్ నాస్కర్‌ను తొలుత కోల్‌కతాలోని బంగూర్ హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ 11 రోజుల చికిత్స తర్వాత ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. శుక్రవారం ఆయనకు కరోనా నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా అతడి ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా అతడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దీంతో శనివారం రాత్రి కన్నుమూశారు.

ఎమ్మెల్యే జయంత్‌ నాస్కర్‌ మృతి తనను చాలా బాధించిందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. నాస్కర్ మృతి పట్ల సంతాపం తెలిపిన మమత.. ప్రజా సేవలోనే ఆయన తన జీవాతాన్ని సాగించారని అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తమ వెంటే ఉన్నారని గుర్తు చేసుకున్నారు. జయంత్ నాస్కర్ 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ టిక్కెట్ పై గెలిచారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.

ట్రెండింగ్ వార్తలు