MIM join with Shiv Sena : బీజేపీ ఓటమే లక్ష్యంగా..శివసేనతో చేయి కలిపిన ఎంఐఎం..!!

బీజేపీని ఓడించడానికి హిందుత్వ పార్టీ శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమితో ఎంఐఎం చేయి కలిపింది.

MIM join hands with Shiv Sena in Maharashtra : బీజేపీ-ఎంఐఎం పార్టీలకు ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవటం సర్వసాధారణంగా ఉంటుంది. ఎంఐఎంది ఇస్లామిక్ వాదం అయితే బీజేపీది పక్కా హిందూత్వ వాదం. బీజేపీని ఓడించటానికి ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
(ఎంఐఎం) ఎప్పుడూ యత్నిస్తునే ఉంటుంది. ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించటానికి ఎంఐఎం మరో హిందూత్వ వాద పార్టీతో చేతులు కలిపింది. అదే మహారాష్ట్రలోని ‘శివసేన’. శివసేన కూటమితో ఎంఐఎం చేతులు కలిపింది.

రాజకీయ పార్టీలు అవసరానికి తగ్గట్టుగా తమ నిర్ణయాలను..పొత్తులను మార్చుకుంటుంటాయనే విషయం తెలిసిందే. ఈక్రమంలో తన ప్రధాన రాజకీయ శత్రువు బీజేపీని ఓడించడానికి హిందుత్వ పార్టీ శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమితో ఎంఐఎం చేయి కలిపింది. మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఈ కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు.

ఈ క్రమంలో ఎంఐఎంకు చెందిన ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శివసేనతో తమకున్న సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రం ఇకపై కూడా కొనసాగుతాయని అనడం గమనించాల్సిన విషయం.

తమ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ధూలియా, మాలేగావ్ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలను ప్రభుత్వానికి చేశామని ఇంతియాజ్ చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. ఏదేమైనప్పటికీ శివసేన కూటమితో ఎంఐఎం చేతులు కలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

శుక్రవారం (10,2022)పోలింగ్ జరుగుతున్న మహారాష్ట్ర నుంచి ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 20ఏళ్లకు పైగా మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు