MNM symbol torchlight : కమల్ హాసన్ కు కోపమొచ్చింది. టార్చ్ లైట్ విసిరికొట్టారు

torchlight

Kamal Haasan : సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కు కోపమొచ్చింది. చేతిలో ఉన్న టార్చ్ లైట్ ను అమాంతం విసిరికొట్టారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించడంతో నేతలు, ఫ్యాన్స్ ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కమల్..టార్చ్ లైట్ విసిరివేస్తున్న సీన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన పార్టీ గుర్తు ‘టార్చ్ లైట్’ అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. కరుణానిధి, జయలలిత మరణించిన తర్వాత..తొలి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ ఎన్నికల కదనరంగంలోకి మక్కల్ నీది మయ్యం కూడా పోటీ చేస్తోంది. ఈ పార్టీ చీఫ్ కమల్ హాసన్ దక్షిణ కోయంబత్తూరు నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..కమల్…ఆ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నరాు. కాన్వాయ్ లో వెళుతూ..అభివాదం చేస్తున్నారు. ఈ క్రమంలో..మాట్లాడుతుండగా..కమల్ మైక్రో ఫోన్ పని చేయలేదు. మాటలు వినకపోవడం కమల్ గమనించారు. వాహనంలో ఉన్న వారిని ఏమైందని అడిగారు. ఎంతకీ మైక్రో ఫోన్ పనిచేయకపోవడంతో..తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చేతిలో ఉన్న టార్చ్ లైట్ ను అమాంతం వాహనంలోకి విసిరికొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది. కమల్..అంత కోపం వద్దూ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

తమిళనాడులో 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉంటుందని CEC తెలిపింది. కన్యాకుమారి ఎంపీ సీటు ఉప ఎన్నిక కూడా దీనితో పాటు జరగనుంది. ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. తప్పకుండా గెలుస్తామని డీఎంకే చెబుతోంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. అస్సాంలో మూడు దశల్లో, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.