Uttar Pradesh
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో నలుగురు 14ఏళ్లలోపువారే. యూపీలోని మౌ జిల్లా కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సజీవదహనమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Fire Accident In Russia : వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
ఒకే కుటుంబానికి చెందిన వీరంతా షాపూర్ గ్రామంలో ఓ గుడిసెలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి 9గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, స్టవ్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇంటికి అంటుకొని ఐదుగురు సజీవదహనం అయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే సమాచారం అందడటంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఐదుగురు మరణించారు. ఈ మంటలు వ్యాపించిన సమయంలో కుటుంబ పెద్ద రామశంకర్ రాజ్‌భర్ ఆరుబయట నిద్రిస్తున్నాడు.
మృతుల్లో మహిళతోపాటు 14, 10, 12, 6 సంవత్సరాల వయస్సు గల నలుగురు పిల్లలు మొత్తం ఐదుగురు సజీవదహనం అయ్యారు. జిల్లా మెజిస్ట్రేట్ అనికుమార్ మాట్లాడుతూ.. ప్రాథమిక నివేదిక ప్రకారం పొయ్యి నుంచి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నామని, పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని తెలిపారు. మృతులకు రూ. 4లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు.