Tribal women have equal rights with tribal men
Supreme Court: వీలునామా లేని ఆస్తికి వారసత్వ హక్కులను గిరిజన పురుషులతో సమానంగా పొందేందుకు గిరిజన మహిళలు కూడా అర్హులేనని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. గిరిజనుడు కానటువంటి తండ్రికి కుమార్తె ఆస్తిలో సమాన వాటా పొందేందుకు అర్హురాలు అయినపుడు, గిరిజన తండ్రికి జన్మించిన కుమార్తెకు ఆ హక్కును నిరాకరించడంలో హేతుబద్ధత లేదని పేర్కొంది. షెడ్యూల్డు తెగల మహిళలకు ఈ హక్కులను వర్తింపజేసే విధంగా చట్టాన్ని సవరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.
అనంతర జీవిత్వం ప్రాతిపదికపై సేకరించిన భూమికి సంబంధించిన నష్టపరిహారంలో వాటా పొందేందుకు షెడ్యూల్డు తెగలకు చెందిన వ్యక్తి యొక్క కుమార్తెకు హిందూ వారసత్వ చట్టం ప్రకారం హక్కు ఉంటుందా? అని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. కాగా, ఈ పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. వాస్తవానికి, హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 2(2) ప్రకారం షెడ్యూల్డు తెగలకు ఈ చట్టం వర్తించదు. ఈ నేపథ్యంలో సుప్రీం స్పందిస్తూ, తండ్రి మరణానంతరం ఆస్తికి వారసురాలయ్యే హక్కును గిరిజన మహిళకు తిరస్కరించడం సరికాదని తెలిపింది. ఈ చట్టంలోని సెక్షన్ 2(2) అమల్లో ఉన్నంత కాలం అది వర్తిస్తుందని పేర్కొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కుమార్తెకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం చట్టం దృష్టిలో తప్పవుతుందని అభిప్రాయపడింది. దీనిని సమర్థించలేమని కుండ బద్దలు కొట్టింది. సమానత్వం ప్రాతిపదికపై అప్పీలుదారువైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది.
Maha-Karnataka: ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి.. మహా-కర్ణాటక వివాదంపై ఉద్ధవ్ డిమాండ్
హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలు గిరిజన మహిళలకు వర్తించకపోవడాన్ని పరిశీలించి, అవసరమైతే తగిన సవరణలు చేయడం గురించి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. భారత రాజ్యాంగంలోని అధికరణలు 14, 21 ప్రకారం భారతీయులకు హామీగా లభించిన సమానత్వ హక్కులను పరిగణనలోకి తీసుకుని, కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. హిందూ వారసత్వ చట్టం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అయిందని, ఆ తర్వాత అనేక మార్పులు జరిగాయని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా గిరిజన మహిళకు సమానత్వాన్ని నిరాకరించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది.